శ్రీ వారి మీద రాజకీయం మొదలుపెట్టారు…!

అనుకున్నట్టుగానే శ్రీ వారి నగల మీద రాజకీయం మొదలయ్యింది. శ్రీ వారి నగలు మాయం అయ్యాయని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తితో కలిసి ప్రెస్‌మీట్‌ పెట్టడం టీటీడీ వర్గాల్లోనే కాక శ్రీవారి భక్తుల్లోనూ అప్పట్లో తీవ్ర ఆశ్చర్యం వ్యక్తమయింది. బోరుగడ్డ అనిల్ ఏకంగా హోంమంత్రి పేరు చెప్పుకుని భూసెటిల్మెంట్లు చేసినట్లు అతని మీద కేసులున్నాయి. గుంటూరు జిల్లా తాడికొండ స్టేషన్‌లో అనిల్‌పై రౌడీ షీట్ కూడా ఉంది. బోరుగడ్డ అనిల్ సైమన్ అమృత్ ఫౌండేషన్ అనే క్రిస్టియన్ చారిటీ సంస్థను నిర్వహిస్తున్నారు. గుంటూరు వల్లూరివారి తోటలో.. భీంసేన పేరుతో ఓ కార్యాలయం ప్రారంభించారు. ఇంత నేర చరిత్ర, అన్యమత ప్రచారం చేసే వ్యక్తితో రమణదీక్షితులకు ఎక్కడ పరిచయం అయింది..? ఎలా ఇద్దరూ కలిసి ప్రెస్‌మీట్ పెట్టే స్థాయికి వచ్చారు..? అసలు తెర వెనుక ఏం జరుగుతోందన్న అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి. ఇది మాత్రమె కాక బోరుగడ్డ అనిల్‌ కు జగన్‌ కుటుంబంతో బంధుత్వం ఉందని, బోరుగడ్డ అనిల్‌ కుమార్‌ చిన్నమ్మ జగన్‌కు బంధువు అవుతారని ఇదంతా హిందుత్వం మీదా, ఎపీప్రభుత్వం మీదా జరుగుతున్న కుట్ర అని అప్పట్లో బ్రాహ్మణ వేదికలు గగ్గోలు పెట్టాయి.

ఇప్పుడు ఏకంగా శ్రీవారి కైంకర్యాల్లో ఆగమ నియమాలను విస్మరించి అపచారం చేస్తున్నారంటూ తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన అభియోగాలను ఉటంకిస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసారు సదరు బోరుగడ్డ అనిల్ కుమార్. ఈ వ్యాజ్యాన్ని అనిల్‌కుమార్‌, గుజరాత్‌కు చెందిన భూపేంద్ర కె. గోస్వామి సంయుక్తంగా దాఖలు చేసినట్టు అందులో దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి, టీటీడీ బోర్డు చైర్మన్‌, ఈవో, ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాను ప్రతివాదులుగా చేర్చారని తెలుస్తోంది. కనబడకుండా పోయిన స్వామివారి పురాతన నగలపై కమిటీ వేయాలని, టీటీడీ బోర్డు చూపుతున్న ఆదాయ వ్యయాలు, నేలమాళిగల్లోని రహస్య నిధులపై సీబీఐ విచారణకు ఆదేశించాలని వారు వ్యాజ్యంలో కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం, దాని అనుబంధ ఆలయాలను రక్షిత కట్టడాలుగా గుర్తిస్తూ ఈ ఏడాది మే 4న ఆర్కియాలజీ శాఖ జారీచేసిన సర్క్యులర్‌ను పునరుర్ధరించాలని కోరారు. దీనిని బట్టి చూస్తుంటే ఆపరేషన్ గరుడని ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని పార్టీల వారు తమ తమ పాత్రలు పోషిస్తున్నారు అని విశ్లేషకులు భావిస్తున్నారు.