టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయనకు వంతపాడే మీడియా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు సొంతిళ్లు కట్టిస్తుంటే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలకు 30 లక్షలకుపైగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే అడ్డుకునేందుకు కోర్టు కెళ్లి స్టే తెచ్చారని, అక్రమాలు జరిగాయని గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు.
తాజాగా వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకం పై దుష్ప్రచారంతో రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లే అవుట్లలో 5 శాతం భూమి లేదా సమానమైన స్థలాలుగానీ ఇతర ప్రత్యామ్నాయాలతో ‘భూ బ్యాంక్’ ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే పెడార్థాలు తీస్తున్నారని చెప్పారు. పేదలపై చంద్రబాబుకు అంత కక్ష ఎందుకని ప్రశ్నించారు. పార్లమెంటులో ఆ పార్టీ సభ్యులు రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దు అని మాట్లాడుతుండడమే వారికి పేదలు, బలహీన వర్గాల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థమవుతుందన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడే రాష్ట్రాలు అప్పులు తీసుకుంటాయన్నారు.
చంద్రబాబు ఏనాడైనా పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక్క పథకాన్నైనా ప్రశంసించారా? అని బొత్స ప్రశ్నించారు. జవసత్వాలు కోల్పోయిన చంద్రబాబుని నిలబెట్టాలని ఒకటి రెండు పత్రికలు, చానళ్లు ఆపసోపాలు పడుతున్నాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, సీఎం జగన్ ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చాలని తాపత్రయ పడుతున్నారని చెప్పారు. గత సర్కారు నిర్వాకాలతో పెను ఆర్థిక భారాన్ని భరించాల్సి వచ్చినా సీఎం జగన్ నిబ్బరంగా పేదలకు మేలు చేసేలా పాలన సాగిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని పేదలందరికి ఇళ్లు నిర్మించి ఇస్తామని, ఓటీఎస్ విధానాన్ని అమలు చేస్తామని, పేదలకు భూ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.