ప్రాణాలు తీసిన ఐఫోన్

ప్రాణాలు తీసిన ఐఫోన్

ఐఫోన్ దొంగిలించిన దొంగను వెంటాడే ప్రయత్నంలో నడుస్తున్న రైలు నుంచి దూకి ఒక ఎలెక్ట్రికల్ ఇంజినీర్ మరణించాడు. ఈ దారుణ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని ఉలుబెరియా రైల్వే స్టేషన్ వద్ద శనివారం చోటుచేసుకుంది. సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో తన సొంతూరు జంషెడ్‌పూర్ వెళుతున్న సౌరబ్ ఘోష్ కిటికీ పక్కన సీట్లో కూర్చుని తాను కొత్తగా కొన్న ఐఫోన్‌లో మాట్లాడుతున్నాడు. రాత్రి 11 గంటల సమయంలో ప్లాట్‌ఫామ్ మీద ఉన్న ఒక దొంగ కిటికీలోనుంచి ఐఫోన్ లాక్కుని పారిపోగా ఘోష్ అతని పట్టుకునేందుకు పరుగెత్తాడు. నడుస్తున్న రైలులో నుంచి కిందకు దూకే ప్రయత్నంలో అతను పట్టుజారి పట్టాల పక్కనున్న రాళ్లపై పడ్డాడు. అతని తల రాళ్లకు కొట్టుకుని అపస్మారకంలోకి వెళ్లాడు.

వెంటనే ఘోష్‌ను ఆసుపత్రికి తరలించడగా అతను చికిత్స పొందుతూ మరణించాడు. వృత్తిపరంగా ఎన్నో విజయాలు సాధించిన ఘోష్ ఇటీవల తాను పనిచేసే కంపెనీకి చెందిన రెండు యూనిట్లకు ఇన్‌చార్జి అయ్యాడు. ముకుంద్‌పూర్‌లో సొంత ఫ్లాట్ కొనుక్కొని అందులోనే నివసిస్తున్నాడు. ఐఫోన్లంటే ఘోష్‌కు చాలా మక్కువ. ఎంతో ముచ్చటపడి పది రోజుల క్రితమే కొనుక్కున్న ఖరీదైన ఐఫోన్‌ను దొంగిలించడంతో తట్టుకోలేకపోయాడు. తన ఐఫోన్‌ను దక్కించుకోవాలన్న తపనే అతను దొంగను వెంబడించేలా చేసిందని ఘోష్ తండ్రి వాపోయాడు. తన కుమారుడి జ్ఞాపకార్థం తమకు పోగొట్టుకున్న ఐఫోన్‌ను ఇప్పించాలని ఘోష్ తండ్రి పోలీసులను కోరాడు. అయితే, ఐఫోన్‌ను ట్రాక్ చేసి దొంగను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.