ఆర్ఎంపీ వైద్యం వికటించి మండల పరిధిలోని గుంటుపల్లెకు చెందిన యువకుడు వడ్డే మణిదీప్ (17) మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ పెద్దయ్య నాయుడు తెలిపిన వివరాలు.. ఈనెల 22న మణిదీప్ జ్వరం, కాళ్ల నొప్పులతో బాధ పడుతూ వెల్దుర్తిలోని ఆర్ఎంపీ వైద్యుడు వెంకటేశ్వర్లు(అనిల్ క్లినిక్)ను సంప్రదించాడు. అతడు కుడికాలి మక్కికి ఇంజక్షన్ వేసి నయమవుతుందని పంపేశాడు. ఇంటి కెళ్లిన తరువాత కాలు వాపు వచ్చింది. మరుసటి రోజు బొబ్బలు వచ్చాయి.
మంగళవారం తండ్రితో కలిసి ఆర్ఎంపీ వద్దకు వెళ్లి ప్రశ్నించగా డోనుకు గానీ, కర్నూలుకు కానీ వెళ్లి వైద్యం చేయించుకోవాలని ఉచిత సలహా ఇచ్చాడు. డోన్‌లోని వాణి పాలి క్లినిక్‌కు వెళ్లగా ఇంజక్షన్ వికటించిందని, కర్నూలుకు వెళ్లాలని అక్కడి వైద్యులు చెప్పారు. కర్నూలుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. తన కుమారుడు మృతికి ఆర్ఎంపీ వైద్యుడే కారణమంటూ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.