ప్రేమలో ఉన్నప్పుడు పరస్పరం కానుకలు ఇచ్చుకోవడం సహజం. అలాగే ప్రేమలో బ్రేకప్‌లు కూడా సర్వసాధారణమే. కానీ, మరో యువతితో పెళ్లి ఫిక్స్ కావడంతో బ్రేకప్ చెప్పిన ఆ ప్రియుడి తీరును ఆమె తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో.. ప్రియురాలిపై కోపంతో దాష్టీకానికి పాల్పడ్డాడు.
తాను కానుకగా ఇచ్చిన సెల్‌ఫోన్.. తిరిగి ఇవ్వడం లేదన్న కోపంతో ప్రియురాలిని ఏకంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. జార్ఖండ్‌లోని పాకుర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 20 ఏళ్ల యువకుడు, సదరు బాధిత యువతి రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో కూడా తెలుసు. అబ్బాయి ఇంట్లో అభ్యంతరాలు చెప్పకపోతే ఈ ఏడాదిలో వీళ్లద్దరికి వివాహం చేయాలని అనుకున్నారు కూడా. అయితే..
ఈ మధ్యే ఆ యువకుడికి మరో యువతితో నిశ్చితార్థం జరిగింది. దీంతో ప్రియురాలికి దూరంగా ఉంటూ వస్తున్నాడు. అంతేకాదు తాను కొనిచ్చిన కాస్ట్‌లీ ఫోన్‌ను తిరిగి ఇచ్చేయాలంటూ ఆమెను అడుగుతూ వస్తున్నాడు. ఆమె అంగీకరించకపోవడంతో కోపం పెంచుకున్నాడు. ఆదివారం ఉదయం స్థానిక మైదానంలో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్ చూద్దామంటూ ఆమెను బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె గొంతు కోసి సెల్‌ఫోన్ తీసుకెళ్లాడు. రక్తపు మడుగులో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది.
సోమవారం ఉదయం మృతదేహాన్ని గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తులో ప్రియుడే ఆమెను బయటకు తీసుకెళ్లినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దీంతో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గట్టిగా నిలదీయడంతో నేరం ఒప్పుకున్నాడు నిందితుడు.