చిన్నారిని కిడ్నాప్ చేసిన యువకుడు

చిన్నారిని కిడ్నాప్ చేసిన యువకుడు

ఆ కుర్రాడికి పద్నాలుగేళ్లు. పదో తరగతి చదువుతున్నాడు. హైదరాబాద్ నగరంలోని ఒక ప్రైవేటు స్కూల్లో చదువుతున్న ఇతగాడు జల్సాలకు అలవాటు పడ్డాడు. సులువుగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో చేసిన వైనం ఒకటి సంచలనంగా మారటమే కాదు గుండెలు అదిరేలా చేస్తోంది. మీర్ పేటలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు కొత్త భయాల్ని తెచ్చేలా చేసింది.

మీర్ పేటకు చెందిన రాజు అనే ఐటీ ఉద్యోగి ఉన్నారు. వారికి ఏడేళ్ల అర్జున్ ఉన్నాడు. ప్రైవేటు స్కూల్లో ఒకటో తరగతి చదివే అర్జున్ ను పద్నాలుగేళ్ల కుర్రాడు మాయమాటలు చెప్పి తనతో తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత ఆ పిల్లాడు తండ్రికి ఫోన్ చేశాడు.

పెద్దవాళ్ల గొంతును అనుకరిస్తూ నీ కొడుకును కిడ్నాప్ చేశాను డబ్బిస్తే కానీ వదలను రూ.3లక్షలు తీసుకొని వెంటనే రా లేకుంటే నీ కొడుకు నీకు దక్కడంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో హడలిపోయిన రాజు వెంటనే స్థానిక పోలీసుల్ని ఆశ్రయించారు.

వెంటనే రంగంలోకి దిగిన మీర్ పేట పోలీసులు కిడ్నాపర్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా అతడున్న ప్రాంతాన్ని గుర్తించారు. అల్మాస్ గూడలోని వైఎస్సార్ నగర్ లో ఉన్నట్లు గుర్తించి హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అయితే పిల్లాడితో పాటు ఉన్న 14 ఏళ్ల కుర్రాడే కిడ్నాపర్ అన్న విషయాన్ని తెలుసుకొని షాక్ తిన్నారు. కుర్రాడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఇలాంటి దరిద్రపుగొట్టు ఆలోచన రావటం ఏమిటని పోలీసులు సైతం అవాక్కవుతున్నారు.