భార్య టీ అడిగితే ఇవ్వలేదని ఓ వ్యక్తి ఆత్మహత్య

భార్య టీ అడిగితే ఇవ్వలేదని ఓ వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్‌లో భార్య టీ అడిగితే ఇవ్వలేదని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.వివరాల ప్రకారంజగద్గిరిగుట్ట బాలయ్యనగర్‌లో ఆడివయ్య(35) అనే వ్యక్తి భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఆటోడ్రైవర్ అయిన ఆడివయ్య ఆదివారం ఉదయం బయటకు వెళ్తూ టీ ఇవ్వాలని భార్యను అడిగాడు. తాను ఇంటి పనిలో బిజీగా ఉన్నానని, కాసేపు ఆగాలని ఆమె భర్తకు చెప్పింది.

దీంతో ఆవేశానికి గురైన ఆడివయ్య భార్యతో గొడవపడ్డాడు. జ్యోతి కూడా ఎదురుతిరగడంతో మనస్తాపానికి గురై సమీపంలో ఉన్న క్వారీ గుంతలో దూకేశాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు అతడిని రక్షించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. గుంతలో నీరు నిండుగా ఉండటంతో కొద్ది నిమిషాల్లోనే ఆడివయ్య ఊపిరాడక చనిపోయాడు.

కొద్ది నిమిషాల ముందు వరకు తనతో గొడవపడిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్న జ్యోతి పిల్లలతో కలిసి అక్కడికి చేరుకుని రోదించింది. టీ ఇవ్వలేదన్న చిన్న కారణంతోనే ఆత్మహత్య చేసుకుని తన జీవితానికి దిక్కు లేకుండా చేసేశాడని జ్యోతి విలపించిన తీరు అందరినీ కలచివేసింది.