ఓ బాలికను యువకుడు బలవంతంగా పెళ్లి చేసుకున్నట్లు అల్లవరం పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఓడలరేవు బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో రామచంద్రపురానికి చెందిన పోలినాటి మణితేజ చదువుతున్నాడు. ఇదిలా ఉంటే ఓ బాలిక తల్లి జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లింది. దీంతో ఆమె ఓడలరేవులోని అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది. బీవీసీలో ఇంజినీరింగ్ చదువుతున్న మణితేజ ఆ బాలిక అమ్మమ్మ ఇంట్లోకి అద్దెకు వచ్చాడు. ఈ సమయంలో బాలికతో పరిచయం పెంచుకున్నారు.
అక్కడితో ఆగకుండా పరిచయాన్ని కాస్తా పెళ్లి వరకు తీసుకొచ్చాడు. బాలికకు పెళ్లి ఇష్టం లేకపోయినా గత నెల 29న తన స్నేహితులతో బలవంతంగా తీసుకొచ్చి బెండమూర్లంక వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వివాహం చేసుకున్నాడు. అక్కడి నుంచి రామచంద్రపురానికి తీసుకెళ్లాడు. అక్కడేం జరిగిందో బలవంతంగా పెళ్లి చేసుకున్న మణితేజ నుంచి తప్పించుకుని శనివారం అల్లవరం పోలీస్ స్టేషన్లో బాలిక ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై ఎస్సై బి.ప్రభాకరరావు కేసు నమోదు చేశారు. అమలాపురం డీఎస్పీ మాసూమ్ బాషా దర్యాప్తు చేపట్టారు.