సినిమా హీరోలా తాను కూడా ఓ అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలనుకున్న ఓ బాలుడు లిఫ్ట్‌లో ఒంటరిగా ఉన్న బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మైనర్ బాలుడిని విచారించగా తాను కొన్ని సినిమాలను చూశానని, ఓ హీరో ఆ సినిమాలో హీరోయిన్‌ను ముద్దు పెట్టుకునే సీన్ తనకు బాగా నచ్చిందని, తనలా నేను కూడా ఎప్పటికైనా చేయాలనే ఆలోచనతో ఇలా చేశానని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని వెంకటగిరి సమీపంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ వద్ద వాచ్‌మెన్ కుమారుడు(14) అదే అపార్ట్‌మెంట్‌లోని 3వ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికను ఆరో అంతస్తులో ఎవరో పిలుస్తున్నారంటూ మంగళవారం సాయంత్రం బాలికను లిఫ్ట్‌లోకి రప్పించి ముద్దు పెట్టుకున్నాడు. లిఫ్ట్ ఆరో అంతస్తుకు వెళ్లే వరకు ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
తన వద్ద ఉన్న ఫోన్‌తో బాధిత బాలిక తల్లికి ఫోన్ చేసింది. అప్రమత్తమైన తల్లి అక్కడికి చేరుకొని తన కూతురిని ఇంటికి తీసుకెళ్లింది. జరిగిన ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బాలుడిని ఐపీసీ సెక్షన్ 354, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి జువైనల్ హోంకు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.