ముఖంపై మొటిమలు, మచ్చలు ఉన్నాయని మనస్తాపం చెంది, కొద్దికాలంగా ఆత్మన్యూనతతో బాధ పడుతున్న ఓ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. మాణిక్యపురానికి చెందిన సునీల్ నాయక్ (20) ఆదివారం ఉదయం ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులకు మృతుడి తల్లి పద్మానాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. చిన్నప్పటి నుంచీ ముఖంపై మచ్చలున్నా పట్టించుకోలేదు గానీ కాలేజీ చదువు ప్రారంభమయ్యాక సునీల్ నాయక్ చిన్నతనంగా భావించేవాడు. అనునిత్యం ముఖంపై గుడ్డ కప్పుకునే తిరిగేవాడు. ఎందరో వైద్యుల వద్దకు వెళ్లి మందులు వాడినా ఫలి తం లేకపోయింది. తననందరూ చులకనగా చూ స్తారని తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురయ్యేవాడు. చివరకు ఆదివారం ఇంట్లో ఫ్యానుకు ఉరిపోసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు.
పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనుకున్న కన్న కొడుకు కళ్ల ముందే విగతజీవిగా మారడంతో పేద తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.కవిటి ఏఎస్ ఐ డీవీ భాస్కరరావు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారని కవిటి ఎస్ఐ కె.వాసూనారాయణ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ లీల ఈ మృతదేహానికి కరోనా వైరస్ పరీక్ష చేయాలని, అంతవరకు మృతదేహాన్ని పోస్టుమార్టం చేయవద్దని స్థానిక వైద్యసిబ్బందికి సూచించారు. సోమవారం కరోనా పరీక్ష జరిపిన తర్వాత పోస్టుమార్టం నిర్వహించనున్నారు.