మొబైల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడవద్దని మందలించారని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. ఆరిలోవలో అక్క ఇంట్లో ఉంటున్న వంశీకృష్ణ అనే 13 సంవత్సరాల యువకుడు మొబైల్లో ఆన్లైన్ గేమ్‌లకు బానిసయ్యాడు. గత రాత్రి అక్క తీవ్రంగా మందలించడంతో మొబైల్ విసిరేసిన వంశీ ఇంటి నుంచి పారిపోయి బయటకు వచ్చేసాడు. ఈ క్రమంలో ఈ రోజు(బుధవారం) ఉదయం ముడ సర్లోవ పార్క్ ఎదురుగా మామిడి చెట్టుకు వంశీకృష్ణ ఉరిపవేసుకుని విగతా జీవిగా కనిపించాడు.
మొబైల్ ఆటలకు అలవాటు పడ్డ వంశీకృష్ణ కుటుంబ సభ్యులు వద్దనే మందలించడంతో ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అమ్మ నాన్న చనిపోవడంతో తన వద్ద ఉంటున్న తమ్ముడు వంశీకృష్ణ ఈ రకంగా అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇలాంటి ఆన్లైన్ గేమ్‌లకు బానిసలైన యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఓ ప్రత్యేక సెల్‌ను కూడా ఏర్పాటు చేశారు.