తల్లి డబ్బులు ఇవ్వలేదని ఓ యువకుడు మనస్తాపానికి గురై మంటల్లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని ఉప్పరిపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి గ్రామస్తులు, పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కుమ్మరి రాజేష్(22) ఇంటర్ వరకు చదువుకుని ఐటీఐ పూర్తి చేశాడు. కాగా, ఇటీవల తల్లి కళావతి, అన్న మహేష్‌లు అప్పులు చేసి రూ.4లక్షలు పెట్టి భూమి కొన్నారు. ఈ భూమిని కొనడం ఇష్టం లేని రాజేష్ తాను వనపర్తిలో అద్దె ఇంట్లో ఉంటూ ఏదైనా పనిచేసుకుంటానని తనకు డబ్బులు ఇవ్వాలని తల్లీ, అన్నలపై ఒత్తిడి తెచ్చాడు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బంద్ ఉందని, లాక్డౌన్ ముగిసిన తరువాత వెళ్లమని నచ్చజెప్పారు. అయినప్పటికీ పట్టించుకోకుండా రాజేష్ డబ్బులు అడిగేవాడు. ఎంతకూ డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన రాజేష్ సోమవారం పొలం దగ్గరకు వెళ్లి కొత్తకుంట చెరువు ప్రాంతంలో పొదగా ఉన్న ముళ్లపొదకు నిప్పు పెట్టి అందులో దూకాడు. మంటలు భారీగా వాపించడంతో పూర్తిగా కాలిపోయాడు. గమనించిన గ్రామస్తులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న మృతుడి కుటుంబ సభ్యులు బోరుమని విలపించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామస్వామి తెలిపారు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో సంఘటన స్థలం దగ్గరే పోస్టుమార్టం నిర్వహించారు.