సాధారణంగా తమకు నచ్చిన అభిమాన నాయకులు, సెలబ్రిటీలతో ఫోటోలు దిగడం, కరచాలనం చేయడానికి అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. దీనికోసం ఎంతటి రిస్క్ చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. తమ ప్రియమైన నాయకుడితో సెల్ఫీదిగే ఏ అవకాశాన్ని వదులుకోరనే విషయం తెలిసిందే. ఒక్కోసారి అభిమానులు ప్రదర్శించే అత్యుత్సాహం వలన నాయకులు, సెలబ్రిటీలు ఇబ్బందిపడుతుంటారు.
ఈ క్రమంలో వీరిపట్ల సెక్యురీటి సిబ్బంది కూడా దురుసుగా ప్రవర్తించిన ఘటనలు కొకొల్లలు. అయితే, దీనికి భిన్నంగా.. కొంత మంది నాయకులు తమ అభిమానుల చిన్నపాటి కోరికలను గమనించి తీర్చటానికి ప్రయత్నిస్తుంటారు. తాజాగా, ఇలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిలో తమిళనాడు.. సీఎం స్టాలీన్ స్థానికంగా జరిగిన ఒక కార్యక్రమానికి హజరయ్యారు.
ఈ కార్యక్రమంలో సీఎం స్టాలీన్‌ను కలవడానికి, ఆయనతో సెల్ఫీ దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. ఈక్రమంలో భద్రత సిబ్బంది అభిమానులందరిని ఒక క్రమపద్ధతిలో సీఎం వద్దకు పంపుతున్నారు. అప్పుడు ఒక ఎరుపు రంగు చొక్క ధరించిన ఒక వ్యక్తి సీఎం స్టాలీన్‌ను వద్దకు చేరుకున్నాడు. పాపం.. సీఎం తో కరచాలనం కూడా చేశాడు. ఆ తర్వాత.. తన జేబులో నుంచి మొబైల్ ఫోన్ తీసి సీఎంతో సెల్ఫీ దిగటానికి ప్రయత్నించాడు.
అప్పుడు వెనుక నుంచి భద్రత సిబ్బంది ముందుకు తోసేశారు. అభిమాని సెల్ఫీ ప్రయత్నాన్ని గమనించిన సీఎం స్టాలీన్.. అతడిని చేయిపట్టుకుని తనవైపులాగి సెల్ఫీ సరదా తీర్చారు. దీంతో అతను ఆనందంతో ఉబ్బితబ్బైపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘అభిమాని మనస్సు గెలుచుకున్నారు..’, ‘సీఎం .. అన్ని గమనిస్తూ ఉంటారు..’, ‘ మొత్తానికి యువకుడి సెల్ఫీ సరదా తీరింది’, అంటూ కామెంట్‌లు చేస్తున్నారు.