టీఎస్పీఎస్సీ వైఫల్యాలు.. వరుస పేపర్ లీక్ ఘటనలతో రాష్ట్రంలో గ్రూప్1 పరీక్ష పలుమార్లు రద్దవ్వడం జరిగిన విషయం తెలిసిందే. మరోవైపు ఇతర పోటీ పరీక్షల మీద దీని ప్రభావం కూడా పడ్డాయి. ఈ నేపథ్యంలోనే గ్రూప్-2 పరీక్ష కూడా వాయిదా పడింది. అయితే తాజాగా ఈ పరీక్ష నిర్వహణపై టీఎస్పీఎస్సీ కసరత్తు షురూ చేసింది. ఈ పరీక్ష జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించబోయే నిర్వహణపై నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమిషన్ సమావేశమైంది.
గ్రూప్-2 పరీక్ష నిర్వహణ అంశాలపై చర్చించింది. గ్రూప్-2 పరీక్షను ఈ ఏడాది ఆగస్టు 29, 30న నిర్వహించాల్సి ఉండగా.. అభ్యర్థుల కోరిక మేరకు కమిషన్ వాయిదా వేసి నవంబర్ 2,3వ తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో మరోసారి వాయిదా వేసి జనవరి 6, 7 తేదీల్లో పరీక్షను నిర్వహిస్తామని కమిషన్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ పరీక్ష నిర్వహణపై సమీక్ష నిర్వహించింది. పరీక్ష నిర్వహణ, నిబంధనలు, వసతులు వంటి పలు అంశాలపై 33 జిల్లా కలెక్టర్లకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ పలు సూచనలు చేశారు. ఈ నెల 7లోగా పరీక్ష కేంద్రాలను ఫైనల్ చేసి టీఎస్పీఎస్సీకి నివేదించాలని ఆదేశించారు.