బ్యూటీపార్లర్ ‌లో వధువు హత్య

బ్యూటీపార్లర్ ‌లో వధువు హత్య

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. బ్యూటీపార్లర్‌కు వెళ్లిన ఓ వధువు అక్కడే పాశవిక హత్యకు గురైంది. రాట్లాం జిల్లాలోని జోరా పట్టణంలో ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడికి సహకరించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. వివరాలు… షాజాపూర్‌ నివాసి అయిన సోనూ యాదవ్‌ అనే యువతికి మూడేళ్ల క్రితం ఓ ఫంక్షన్‌లో రామ్‌ యాదవ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. స్నేహంగా మారి ప్రేమకు దారితీసింది. అనంతరం విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయారు.

ఈ క్రమంలో జూలై 5న సోనూకు వేరొకరితో పెళ్లి జరిపించేందుకు కుటుంబ సభ్యులు నిశ్చయించారు. ఇందులో భాగంగా షాజాపూర్‌ నుంచి సోనూను తీసుకుని జోరా పట్టణానికి వచ్చారు. పెళ్లికి కొన్ని గంటల ముందు బ్రైడల్‌ మేకప్‌ కోసమని వధువు సోను తన కజిన్‌తో కలిసి దగ్గర్లోని బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. అప్పటికే జోరాకు చేరుకున్న రామ్‌ యాదవ్‌ సోనూ జాడ కోసం వెదకసాగాడు. పదే పదే ఫోన్‌ చేసినా ఆమె లిఫ్ట్‌ చేయకపోవడంతో తన స్నేహితుడు పవన్‌ పంచాల్‌ ఫోన్‌ నుంచి కాల్‌ చేసి.. ఆమె బ్యూటీపార్లర్‌లో ఉన్నట్లు తెలుసుకున్నాడు. వెంటనే అక్కడికి వెళ్లి సోనూ గొంతు కోశాడు.

దీంతో ఆమె అక్కడిక్కడే మరణించింది. తను చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత రామ్‌ యాదవ్‌.. పవన్‌తో కలిసి బైక్‌పై పరారయ్యాడు. దాదాపు 25 కిలోమీటర్లు ప్రయాణం చేసి.. అక్కడి నుంచి రాజస్థాన్‌కు పారిపోయాడు. కాగా సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు వ్యక్తులను గుర్తించిన పోలీసులు పవన్‌ను అదుపులోకి తీసుకోగా.. రామ్‌ యాదవ్‌ పగతోనే ఈ హత్యకు పాల్పడినట్లు అతడు వెల్లడించాడు. రాజస్థాన్‌ సరిహద్దు వద్ద రామ్‌ను దింపినట్లు పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రామ్‌ యాదవ్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. సోనూ మరణవార్త విని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పెళ్లి కూతురిగా ముస్తాబై వస్తుందనుకుంటే ఇలా విగతజీవిగా మారిందంటూ ఆవేదన చెందారు.