నేడు మహేంద్ర సింగ్‌ ధోని పుట్టిన రోజు

నేడు మహేంద్ర సింగ్‌ ధోని పుట్టిన రోజు

మ్యాచ్‌లో ఉత్కంఠను తారా స్థాయికి తీసుకెళ్లి ఆఖరి బంతి వరకు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టి చివరకు భారీ షాట్‌తో గెలిపించడం మహేంద్ర సింగ్‌ ధోనికి ‘ఐస్‌’తో పెట్టిన విద్య. ఎవరి అంచనాలకు అందకుండా నిర్ణయాలు తీసుకోవడం అతనికి అలవాటైన ఆట. అనూహ్య ఆలోచనలు, వ్యూహాలు అతనికి కొత్త కాదు. అభిమానులను అలరిస్తూ అరుదైన విజయాలు అందించినా… అవమానకర పరాజయాల్లో కూడా అదే నిగ్రహాన్ని ప్రదర్శించినా అది ధోనికే చెల్లింది. కొందరి దృష్టిలో అతనో అద్భుతమైతే మరికొందరి దృష్టిలో అతనో ‘సుడిగాడు’ మాత్రమే. అయితే ఎవరేమనుకున్నా భారత క్రికెట్‌లో ధోని ఒక అద్భుతం.

‘నేను సిరీస్‌ గెలిచినా ఓడినా నా ఇంట్లో పెంపుడు కుక్కలు నన్ను ఒకే తరహాలో చూస్తాయి’ అంటూ విమర్శకులకు ఘాటుగా జవాబిచ్చినప్పుడు ‘మిస్టర్‌ కూల్‌’లోని మరో రూపం బయటకు వస్తుంది. ఓటమికి కారణాలు విశ్లేషించమని కోరినప్పుడు ‘మీరు చనిపోవడం ఖాయమైనప్పుడు ఎలా చస్తే ఏం. అది కత్తితోనా, తుపాకీతోనా అని అడిగితే ఎలా’ అన్నప్పుడు అతనిలో వ్యంగ్యం వినిపిస్తుంది. కెరీర్‌ ఆరంభం నుంచి ధోని ధోనిలాగే ఉన్నాడు. ఎవరి కోసమో అతను మారలేదు. ధోని పేరు ప్రఖ్యాతులను పట్టించుకోలేదు. కానీ అవే అంగవస్త్రాల్లా అతని వెంట నడిచాయి.

తాను బ్యాట్స్‌మన్‌గా ఆటలో ఎంతో నేర్చుకున్నాడు. అవసరానికి అనుగుణంగా తనను తాను మార్చుకున్నాడు. అంతే కానీ తన బ్యాటింగ్‌ శైలి బాగుండకపోవడం గురించి ఎప్పుడూ చింతించలేదు. కీపింగ్‌ శైలి కూడా ఇంటి ఆవరణలో తనకు తాను నేర్చుకున్నదే తప్ప కోచింగ్‌ సెంటర్‌లో కుస్తీలు పట్టడం వల్ల రాలేదు. కానీ అదే అతనికి కీర్తి కనకాదులు తెచ్చి పెట్టింది. నాయకత్వ ప్రతిభ కవచ కుండలాల్లా ధోనితో కలిసిపోయింది. ఫలితంగా ఎన్నో అరుదైన ఘనతలు, గొప్ప విజయాలు, మరెన్నో రికార్డులు. మహేంద్రుడి సారథ్యం మన క్రికెట్‌పై చెరగని ముద్ర వేసింది.