కాబోయే భర్తపై యువతి హత్యాయత్నానికి ప్రయత్నించిన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. బాధితుడు రామునాయుడిపై దాడి చేసినట్లు నిందితురాలు పుష్ప పోలీసుల ముందు ఒప్పుకుంది. తనకు అసలు పెళ్లే వద్దని చాలాసార్లు తల్లిదండ్రులకు చెప్పానని, అయినా వాళ్లు వినలేదని పుష్ప పోలీసులకు వెల్లడించింది.
అయినా తల్లిదండ్రుల బలవంతంతో రామునాయుడితో వివాహానికి సిద్ధపడింది పుష్ప. ఈ క్రమంలో ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక ఆమె డిప్రెషన్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. బాధితుడిపై ఘోరానికి పాల్పడిందట. చాలా కాలంగా భక్తి మైకంలో ఉన్న పుష్ప.. తనకు పెళ్లి వద్దని, దేవుడి భక్తురాలిగా ఉండిపోతానంటూ తల్లిదండ్రులకు పలుమార్లు చెప్పిందట. అయితే ఇప్పటికే రెండు పెళ్లి చూపులు రద్దు కావడంతో మూడోసారి ఎలాగోలా పుష్పను ఒప్పించారు తల్లిదండ్రులు.
ఈ క్రమంలో కాబోయే భర్తను బయటకు తీసుకెళ్లి చంపాలని పుష్ఫ ప్లాన్ వేసింది. సరదాగా బయటకు వెళ్దామంటూ కోరింది. కత్తి కనిపించకుండా కూడా వెంట తీసుకెళ్లింది. గుడి దగ్గర రామునాయుడు కళ్లకు చున్నీ కట్టి.. సర్ప్రైజ్ అంటూ గొంతు కోసేసింది. టైం బాగుండి.. ప్రాణాలతో బయటపడ్డాడు రామునాయుడు. ఈ ఘటన జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకర్షించగా.. సోషల్ మీడియాలో ఈ ఘటనపై మీమ్స్ పేలుతున్నాయి.