కోల్‌కతాలో ఒక బ్రిడ్జ్ నిట్టనిలువున కుప్పకూలిపోయింది. కోల్కతాలోని అలీగర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ మజర్‌హాట్ బ్రిడ్జి కూలిన ఘటనలో ఇప్పటికే ఐదుగురు మరణించారు. శిథిలాల కింద మరో 30 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అనేక మంది గాయపడ్డారు. సాయంత్రం 4.45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పలు కార్లు, బైక్‌లు తుక్కుతుక్కయ్యాయి. భారీ శబ్దంతో వంతెన కుప్పకూలటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు. కోల్‌కతాలో ఈ బ్రిడ్జి అత్యంత పురాతనమైంది. ఇది బెహలాతో పాటు కోల్‌కతాలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తోంది. పురాతన వంతెన కావడంతో బ్రిడ్జిలోని కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో దాని కింద ఉన్నవారు నలిగిపోయారు. వంతెనపై ప్రయాణిస్తున్న వాహనదారులు గాయాలతో బయటపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం భయానకంగా ఉంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి వచ్చి సహాయ చర్యలను ప్రారంభించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.