Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సాహిత్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్ పురస్కారం బ్రిటన్ ను వరించింది. ఇంగ్లిష్ రచయిత కజువో ఇషిగురోకి 2017 సంవత్సరానికి గానూ సాహిత్యంలో నోబెల్ బహుమతి అందిస్తున్నామని స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. తన నవలల్లో కజువో రాసే ఉద్వేగభరిత సన్నివేశాలు చదివే వారి మనసులు తాకుతాయని అకాడమీ ప్రతినిధులు ప్రశంసించారు. ఆయన రచనల్లో గొప్ప భావోద్వేగ శక్తి ఉంటుందని, ప్రపంచంతో మనుషులకు ఉండే కల్పిత భావాలను ఆయన తన రచనల్లో ప్రతిబింబించారని వారు కొనియాడారు. 62 ఏళ్ల కజువో బ్రిటన్ లో ప్రసిద్ధి చెందిన నవలారచయిత. ఆయన రాసిన ది రిమేన్స్ ఆఫ్ డే, నెవర్ లెట్ మి గో లాంటి నవలలు ఆయనకు ఎంతగానో గుర్తింపు తెచ్చిపెట్టాయి.
ది రిమేన్స్ ఆఫ్ డే నవలకు బుకర్ ప్రైజ్ కూడా లభించింది. ఆ నవల పేరుతో హాలీవుడ్ లో సినిమా కూడా వచ్చింది. కజువో 2005లో రాసిన నెవర్ లెట్ మీ గో నవల సైన్స్ ఫిక్షన్ జానర్ లో ఓ కొత్త ఒరవడిని సృష్టించింది. 2015లో రాసిన ద బరీడ్ జెయింట్ ఫాంటసీ నవల పాఠకులకు కొత్త ప్రపంచంలోకి వెళ్లిన భావన కలుగజేస్తుంది. కజువో ఇప్పటిదాకా. ఎనిమిది నవలలు, కొన్ని సినిమాలకు స్క్రిప్టులు రాశారు. కజువో ఇషిగురో 1954 నవంబరు 8న జపాన్ లోని నాగసాకి లో జన్మించారు. ఐదేళ్ల వయసులో ఆయన కుటుంబం బ్రిటన్ కు వలస వెళ్లింది. అప్పటినుంచి బ్రిటన్ లోనే ఉంటున్న కజువో ఆ దేశ పౌరుడిగానే గుర్తింపు పొందారు.