చదువు భారమై.. మానసిక ప్రశాంతతకు దూరమై ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని దారుణమైన రీతిలో తల్లిదండ్రుల ముందే ప్రాణాలు తీసుకుంది. ఈ దయనీయమైన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన తంగకుమార్ తమిళనాడు రాష్ట్రంలోని అరియలూరు జిల్లాలోని సిమెంట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
ఇతడి కుమార్తె అబిదా (19) శ్రీపెరంబుదూరులోని ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. చదువంటే ఇష్టం లేదు.. అమ్మానాన్నల బలవంతం మీద కాలేజీలో చేరానని హాస్టల్‌లోని తోటి విద్యార్థుల వద్ద తరచూ వాపోయి.. మానసిక కుంగుబాటుకు లోనైంది. ఈ విషయం ప్రిన్సిపల్‌కు తెలియడంతో తల్లిదండ్రులను పిలిపించాడు. అమ్మాయి బాగా కోలుకున్న తరువాత ఆమెకు ఇష్టమైతేనే కాలేజీకి పంపాలని ఆయన సూచించగా వారు సమ్మతించారు.
సోమవారం రాత్రి ఇంటికి బయలుదేరే ముందు.. హాస్టల్ గదిలో ఉన్న సామాన్లు తెచ్చుకుంటానంటూ తల్లిదండ్రులను గౌండ్ ఫ్లోర్‌లో కూర్చోబెట్టి అబిదా మిద్దెపైకి వెళ్లింది. ఐదో అంతస్తుకు చేరుకుని అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తమ కళ్లముందే అబిదా ప్రాణాలు తీసుకోవడంతో తల్లిదండ్రులు, హాస్టల్ సిబ్బంది తల్లడిల్లిపోయారు.