విజయవాడలో బిల్డర్‌ దారుణ హత్య

విజయవాడలో బిల్డర్‌ దారుణ హత్య

విజయవాడ నగరంలో ఓ బిల్డర్‌ దారుణ హత్యకు గురవడం కలకలం రేపింది. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలోనే దుండగులు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నున్న రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. విశాఖపట్నానికి చెందిన పీతల అప్పలరాజు విజయవాడలో అపార్ట్‌మెంట్లు నిర్మించి విక్రయిస్తుంటాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో ఆఫీస్‌ నిర్వహిస్తూ పాయకాపురంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. భార్యా పిల్లలు మాత్రం విశాఖలోనే ఉంటున్నారు.

నెలలో పది రోజులు విజయవాడలో ఉంటూ మిగిలిన 20 రోజులు విశాఖలో ఉంటాడు.ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి తన ఇంటి మొదటి అంతస్తులో నిద్రించిన అప్పలరాజు.. సోమవారం ఉదయం ఎంతకీ బయటకు రాకపోవడంతో కింది పోర్షన్‌లో ఉంటున్న వారు పైకి వెళ్లి చూశారు. మంచంపై అప్పలరాజు విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. నార్త్‌ ఏసీపీ షేక్‌ షాను, సీఐ హానీష్‌బాబులు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. మృతుడి తలపై తీవ్ర గాయాలున్నాయి.

అనంతరం డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీమ్‌లను రంగంలోకి దించి దర్యాప్తు చేపట్టారు. పోలీస్‌ జాగిలాలు హత్య జరిగిన ప్రాంతం నుంచి దూరంగా ఉన్న బ్రాందీ షాపు, గృహ సముదాయాల మధ్య సంచరించాయి. సమీపంలోని సీసీ కెమేరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కొన్ని ఆధారాలు లభించాయని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ చెప్పారు. ఆర్థిక లావాదేవీలు లేదా వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.