సంక్రాంతి సీజన్‌లో అయిదు రోజుల పాటు వసూళ్లు అదిరిపోతాయి. అవి కాకుండా శని, ఆదివారాలు, రిలీజ్ డే కలుపుకుని ఏ సినిమాకి అయినా చాలా అడ్వాంటేజీ వుంటుంది. అందుకే ఈ సీజన్‌లో సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు అంతగా పోటీ పడుతుంటారు. ఈసారి సంక్రాంతికి ముందు వీకెండ్ బాగా సెట్ అయింది. అయితే సెంటిమెంట్ పేరు చెప్పి శుక్రవారం, అంటే జనవరి 10న సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో రెండూ విడుదల చేయకూడదని ఫిక్స్ అయ్యారు.
అలా కానప్పుడు జనవరి 11న ఒకటి, జనవరి 12న ఒకటి విడుదల చేసుకునే వీలుంది. అయినా కానీ రెండు సినిమాలూ జనవరి 12 మీదే ఫిక్స్ అయ్యాయి. ఇందుకు కారణమేమిటంటే వెనక వచ్చిన చిత్రం కాస్త బాగుందనిపించుకుంటే ముందు రిలీజ్ అయిన సినిమా ఫెయిల్ అవుతుందనేది ఇరు పక్షాల భయమట. ఇందులో తమ సినిమా పట్ల నమ్మకం కంటే అవతలి సినిమాపై భయమే ఎక్కువ కనిపిస్తోంది.
పండుగ ముందు వారంలో శనివారం సాయంత్రం వసూళ్లని వదులుకోవడం హాస్యాస్పదంగా వుందని, ఒకవేళ వీళ్లు జనవరి 11కి రాకపోతే తమ సినిమా విడుదల చేసుకుంటామని వెంకీమామ, ఎంత మంచివాడవురా నిర్మాతలు చెబుతున్నారు. అయితే ఎలాగయినా ఈ రెండు పెద్ద సినిమాలనే ఆ రెండు డేట్లని తీసుకునేలా చేయాలని ఇప్పటికే తెర వెనుక చర్చలయితే తీవ్రంగానే జరుపుతున్నారు.