ఆత్మహత్య చేసుకున్న ఇంటిలోనే ఆత్మలు…బెంబేలెత్తుతున్న ప్రజలు

burari deaths case ‘Ghost bucket’ appears on rooftop of sealed Bhatia home

సంచలనం సృష్టించిన దిల్లీలోని బురారీ కుటుంబం మరణోదంతంతో దర్యాప్తు చేసే కొద్దీ విస్తుగొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిన్నటికి నిన్న ఓ సీసీటీవీ ఫుటేజ్‌ బయటకొచ్చిన విషయం తెలిసిందే. భాటియా కుటుంబంలోని మొత్తం 11 మంది ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రపంచం మొత్తం నివ్వెరపోతే.. ఇప్పుడు స్థానికులు కొత్త వాదన తీసుకొచ్చారు. మరణించినవారి ఆత్మలన్నీ ఆ ఇంట్లోనే ఉన్నాయని జనం బెంబేలెత్తుతున్నారు. భయపడటమే కాదు.. ఏకంగా ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో అద్దెకు ఉంటున్న వారిలో సగానికి పైగా జనం ఇప్పటికే ఖాళీ చేసి కొత్త ప్రదేశాలకు తరలిపోయారు కూడా. ఈ మేరకు దైనిక్ భాస్కర్ ఓ కథనాన్ని ప్రచురించింది.

ఇక భాటియా నివాసానికి సమీపంలో సొంతిళ్లు ఉన్న వారు భయంతో వణికిపోతున్నారు. ఆ ఇంటిలో ఆత్మలు సంచరిస్తున్నాయనే భయంతో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. భాటియా కుటుంబం ఆత్మహత్యల కేసు ఆది నుంచే తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. కుటుంబసభ్యులంతా మరణించిన తీరు, మోక్షం కోసమే అలా చేశారనే వార్తలు, డైరీలో లభ్యమైన రహస్య సమాచారం, లలిత్ భాటియా వింత ప్రవర్తన ఇవన్నీ పలు అనుమానాలకు దారి తీశాయి. క్షుద్ర పూజలు చేసిన తర్వాతే వారంతా ఆత్మహత్యలకు పాల్పడ్డారని, మరణించాక వాళ్లకు అతీంద్రియ శక్తులు వచ్చాయని ఆ ప్రాంతంలో కొంత మంది ప్రచారం చేస్తున్నారు. దీంతో జనంలో భయం రెట్టింపయ్యింది.

అందుకే మోక్షం కోసం దేవుడి దగ్గరకు వెళ్లిన ఆ ఇంటిని గుడిగా మార్చాలని అక్కడి వారు డిమాండ్ చేస్తున్నారు. కుటుంబంలోని అందరూ చనిపోయారు, వారసులు ఎవరూ లేరు అందుకే దేవుడి కోసం ఇంత చేసిన వారి ఇంటిని ఇప్పుడు ఆ ఇంటిని ఆలయంగా మార్చాలని స్థానికులు గట్టిగా కోరుతున్నారు. ఆ భవనం ఇప్పుడు సీజ్ వేశారు. భవిష్యత్ లో ఆ ఇంట్లో ఎవరూ ఉండే అవకాశం కూడా లేదు. ఇంత పెద్ద ఘోరం జరిగిన తర్వాత దాన్ని ఎవరూ తీసుకునే అవకాశం కూడా ఉండదు. ఈ క్రమంలోనే వారి బంధువులు కూడా ఆలయంగా మార్చటానికి మద్దతు ఇస్తున్నారు. దాన్ని ఆలయంగా మార్చి రోజూ పూజలు చేయాలని అప్పుడే స్థానికులు కూడా ఆ ఘటనను మర్చిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. లేనిపక్షంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇదో పాడుబడిన భవంతిగా మిగిలిపోతుందని.. చుట్టుపక్కల వారు భయపడే అవకాశం కూడా ఉంది అనేది స్థానికుల వాదన. స్థానికులు ఈ విషయాల నుంచి బయటకు రావాలంటే.. ఆ భవంతిని దేవాలయంగా మార్చితేనే మంచిదని కొందరు అధికారులు సైతం సూచిస్తున్నారు.