కరోనా కాలంలో వలస జీవులు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కరోనా.. లాక్ డౌన్ తో రోజుకూలీల బ్రతుకులు మరింత దుర్భరంగా మారాయి. తాజాగా కేరళ నుండి పశ్చిమ బెంగాల్‌కు వెళ్తోన్న వలస కార్మికుల బస్సు బోల్తా పడింది. ఒడిశాలోని బాలసోర్ జిల్లాలో కేరళ నుంచి పశ్చిమ బెంగాల్‌కు వలస కార్మికులను తీసుకెళ్తోన్న బస్సు బోల్తా పడటంతో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈరోజు ఉదయం 6.30 గంటల సమయంలో నుగావ్ గ్రామానికి సమీపంలో ఉన్న నేషనల్ హైవే నెంబర్ 16లో వంతెనపై బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో అతివేగంగా నడపడమే ఈ బస్సు ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
కాగా బస్సులో మొత్తం 28 మంది వలస కార్మికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. గాయపడిన వారిలో ఆరుగురు వలస కార్మికులు, ఒక బస్సు డ్రైవర్ ఉన్నారు. కాగా గాయపడిన వారిని స్థానిక ప్రజలు, పోలీసులు రక్షించి బాలసోర్‌లోని జిల్లా ప్రధాన కార్యాలయంలో చేర్చారు. వలస కార్మికులు పశ్చిమ బెంగాల్ లోని కృష్ణ నగర్ కు చెందినవారుగా గుర్తించారు. గాయపడినవారికి చికిత్స చేయడానికి, కార్మికులను వారి గమ్యస్థానానికి పంపించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని బాలాసోర్ సబ్ కలెక్టర్ నీలు మోహపాత్రా వివరించారు.