ప్రమాదం అనేది ఎప్పుడు ఏ రూపాన, ఎలా ఎదురవుతుందో ఎవరు చెప్పలేరు. అదృష్టం బాగుంటే ఒక్క సారి తృటిలో తప్పిన ఘటనలు చాలానే వున్నాయి. తాజాగా నైనిటాల్ పట్టణ పరిధిలో కూడా అలాంటి ఘటనే జరిగింది. ఉత్తరాఖండ్‌లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. కొండ ప్రాంతాలు కావడంతో ఈ వర్షాలకు బాగా నానిపోయిన కారణంగా తరచూ రహదారులపై కొండ చరియలు విరిగి పడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
నైనిటాల్లో శుక్రవారం ఓ బస్సు 14 మంది ప్రయాణికులతో కొండ ప్రాంతం గుండా వెళ్తోంది. ఇంతలో హఠాత్తుగా కొండ చరియలు విరిగి బస్సు ముందు విరిగిపడ్డాయి.ఇదంతా ఆ బస్సులోని ప్రయాణికులు చూసి భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ సరైన సమయంలో స్పందించి బస్సుని వెనక్కి తీస్తున్నా కూడా కొంతమంది భయంతో బస్సు దిగి పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరుగలేదు. కొండచరియలు విరిగిపడుతున్న వీడియోను మనం చూడవచ్చు.