ఆ స్థానాన్ని ఆక్రమించిన ‘బుట్టబొమ్మ’

‘అల వైకుంఠపురములో’ సినిమా అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలోని పాటల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమా విజయంలో సాంగ్స్‌ కీలక పాత్ర పోషించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘రాములో రాములా’, ‘బుట్టబొమ్మ’ సాంగ్స్‌ దుమ్ము దులిపాయి. ఇక ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ వల్ల బుట్టబొమ్మ సాంగ్‌ విదేశాల్లో కూడా విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకుంది. సినిమా విడుదలయ్యి దాదాపు ఏడాది కావస్తున్పప్పటికి ఏదో ఒక రికార్డు సృష్టిస్తూనే ఉంది.

ఈ నేపథ్యంలో తాజాగా ‘బుట్టబొమ్మ’ మరో రికార్డు సృష్టించింది. యూట్యూబ్‌లో ఈ పాటని ఇప్పటి వరకు 45 కోట్ల మంది వీక్షించారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌, పూజా హెగ్డే అభిమానులు ‘బుట్టబొమ్మ’ హ్యాష్‌ట్యాగ్‌ని ఉదయం నుంచి ట్రెండ్‌ చేస్తున్నారు. రామ జోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్‌ అందించగా.. అర్మన్‌ మాలిక్‌ పాడారు. గతంలో అత్యధిక వ్యూస్‌ సాధించిన తెలుగు సాంగ్‌ రికార్డు ఫిదా సినిమాలోని ‘వచ్చిండే’ పాట‌ ఖాతాలో ఉండేది. ప్రస్తుతం ఆ స్థానాన్ని ‘బుట్టబొమ్మ’ ఆక్రమించింది.

ఇక బుట్ట బొమ్మ సాంగ్‌ 45 కోట్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించడంతో పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. వీరిలో క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌, ‘అల వైకుంఠపురములో’కి మ్యూజిక్‌ అందించిన తమ్‌న్‌ వంటి వారు కూడా ఉన్నారు. వీరంతా ట్విట్టర్‌ వేదికగా అభినందనలు తెలపుతున్నారు. తమన్ ట్విట్టర్‌ వేదికగా‌ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక తెలుగులో సూపర్‌ హిట్టయిన ‘అల వైకుంఠపురములో’ సినిమాను ప్రస్తుతం వివిధ భాషల్లోకి రీమేక్‌ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అల్లు అర్జున్‌ ‘పుష్ప’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ ఊర మాస్‌ లుక్‌తో ఇప్పటికే అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.