క‌ర్నాట‌కంలో కాషాయ‌ద‌ళానికి షాక్..?

C-Fore survey in Karnataka Assembly Elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ క‌ర్నాట‌క‌లో బీజేపీకి షాక్ తగిలేలా ఓ స‌ర్వే విడుద‌ల‌యింది. క‌ర్నాట‌కం గెలుపుతో దక్షిణాదిన పాగా వేయాల‌ని భావిస్తున్న క‌మ‌లం పార్టీకి ఈ స‌ర్వేలో వెల్ల‌డ‌యిన విష‌యాలు ఏమాత్రం మింగుడుప‌డవు. 2013 క‌ర్నాట‌క ఎన్నిక‌లకు మందు సీ-ఫోర్ అనే సంస్థ ఓ స‌ర్వే నిర్వ‌హించి కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని, ఆ పార్టీకి 119 నుంచి 120 సీట్లు వ‌స్తాయ‌ని అంచ‌నావేసింది. ఆ ఎన్నిక‌ల ఫ‌లితాలు స‌రిగ్గా సీ-ఫోర్ ఊహించిన‌ట్టుగానే వ‌చ్చాయి. 122 స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటుచేసింది. ప్ర‌జాభిప్రాయాన్ని అంత క‌చ్చితంగా అంచ‌నావేసిన సీ-ఫోర్ అప్ప‌టిలానే ఇప్పుడు కూడా స‌ర్వే నిర్వ‌హించింది. ఈ నెల 1-25వ తేదీ మ‌ధ్య ప్ర‌జాభిప్రాయాన్ని సేక‌రించింది.

క‌ర్నాట‌క అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలుండ‌గా… 154 నియోజ‌క‌వ‌ర్గాల్లో దాదాపు 22,357 మంది ఓట‌ర్ల‌న మ‌నోగ‌తం తెలుసుకుంది. సీ-ఫోర్ అంచ‌నా ప్ర‌కారం క‌ర్నాట‌కంలో ఈ సారీ హ‌స్తం పార్టీదే విజ‌యం. ఆ గెలుపు కూడా అల్లాట‌ప్పా విజ‌యం కాదు. గ‌త ఎన్నిక‌ల్లో క‌న్నా నాలుగు సీట్లు ఎక్కువగా మొత్తం 126 స్థానాల్లో కాంగ్రెస్ విజ‌యం సాధిస్తుంద‌ని సీ-ఫోర్ వెల్ల‌డించింది. దీని ప్ర‌కారం చూస్తే… క‌న్న‌డ‌నాట ఎలాగైనా గెలుపొంది… దేశ‌మంంతా స‌త్తా చాటాల‌న్న మోడీ-షా ఆశ‌లు గ‌ల్లంత‌యిన‌ట్టే. అయితే కాస్త‌లో కాస్త ఆ పార్టీకి ఉప‌శ‌మ‌నం క‌లిగించే మాటేమిటంటే గ‌తంలో క‌న్నా బీజేపీ బాగా బ‌ల‌ప‌డ‌డం. 2013 ఎన్నిక‌ల్లో కేవ‌లం 40 స్థానాల‌కు ప‌రిమిత‌మైన బీజేపీ..ఈ సారి మాత్రం 70 స్థానాల్లో గెలుపొందుతుంద‌ని సీ-ఫోర్ అంచనావేసింది. బీజేపీ ఇలా బ‌ల‌ప‌డ‌డానికి కార‌ణం జేడీఎస్ బ‌ల‌హీన ప‌డ‌డ‌మే.

గ‌త ఎన్నిక‌ల్లో 40 స్థానాల్లో గెలుపొందిన జేడీఎస్ ఈ సారి మాత్రం 27 స్థానాలకే ప‌రిమిత‌మ‌వుతుందని స‌ర్వేలో వెల్ల‌డ‌యింది. ఇక ముఖ్య‌మంత్రుల విష‌యానికొస్తే..కాంగ్రెస్ స‌హ‌జ‌శైలికి భిన్నంగా దూసుకుపోతున్న సిద్ధ‌రామ‌య్యే మ‌ళ్లీ సీఎం కావాల‌ని దాదాపు 45 శాతం క‌న్న‌డిగులు కోరుకుంటున్నారు. బీజేపీ నుంచి చూస్తే మాజీ సీఎం య‌డ్యూరప్పకు 26 శాతం, జేడీఎస్ నేత కుమార‌స్వామికి 13 శాతం అనుకూలంగా అభిప్రాయం వ్య‌క్తంచేశారు. మొత్తానికి స‌ర్వేల‌పై ఎంతో న‌మ్మ‌కం పెట్టుకునే బీజేపీకి సీ-ఫోర్ గ‌ట్టి షాకిచ్చింది. ఈ సంస్థ అంచ‌నాలు గ‌న‌క నిజ‌మైతే… బీజేపీ ఇక కోలుకోవ‌డం క‌ష్ట‌మే. ఇప్ప‌టికే మిత్ర‌పక్షం టీడీపీ ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం, మ‌రికొన్ని మిత్ర‌ప‌క్షాల‌తో విభేదాలు, ఏపీకి విభ‌జ‌న హామీల అమ‌లులో కేంద్రం నిర్లక్ష్యం, మోడీ ఒంటెత్తుపోక‌డ‌ల‌పై పెరుగుతున్న విమ‌ర్శ‌లు, బీజేపీకి వ్య‌తిరేకంగా భావ‌సారూప్య‌పార్టీల‌న్నీ ఏక‌మ‌య్యే సూచ‌న‌లు… బీజేపీ సుదూర‌ల‌క్ష్యాల‌ను మొగ్గ‌లోనే తుంపేస్తున్నాయి.