క్యాబినెట్ బేటీ కీలక నిర్ణయం ఇదే: వైద్యుల పై ప్రత్యేక ఫోకస్..

విశ్వమంతటితో కనిపించని వైరస్ దడదడలాడిస్తోంది. ప్రపంచ దేశాలను గజగజ వణికించేస్తుంది. దీంతో అన్ని దేశాలు మల్లగుల్లాలుపడుతున్నాయి. ఈ కోరనా వైరస్ బారి నుంచి ఎలా తప్పించుకోవాలా అని విపరీతంగా చర్చోపచర్చలు జరుపుతున్నాయి. అయితే ఈరోజు ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్‌‌ 7లోని ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వివరించారు. కరోనా, లాక్‌డౌన్‌, ఆర్థిక వ్యవస్థపై చర్చించామని ఆయన స్పష్టం చేశారు. అలాగే.. లాక్‌డౌన్ నేపథ్యంలో డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.అదేవిధంగా వైద్య సిబ్బందికి రక్షణ కల్పిస్తామన్న ఆయన దాడులను అరికట్టేందుకు త్వరలో ఆర్డినెన్స్‌ తీసుకు రాబోతున్నట్లు వెల్లడించారు. అలాగే..

దాడులకు పాల్పడితే 3 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. బెయిల్ కూడా లభించబోదని అన్నారు. ఇంకా రూ.5వేల నుంచి రూ.2లక్షల వరకు జరిమానా విధిస్తామని కూడా జవదేకర్‌ తెలిపారు. తీవ్రంగా గాయపరిచిన కేసుల్లో ఆరు నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష ఉంటుందని, రూ.లక్ష నుంచి రూ.5లక్షల జరిమానా విధిస్తామని వైద్యులపై దాడులకు పాల్పడితే తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.అంతేకాకుండా 30రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని కూడా స్పష్టం చేశారు. దాడులు చేసిన వారి దగ్గరే నష్టపరిహారం వసూలు చేస్తామని కూడా అన్నారు. ఆస్పత్రి ఆస్తులు ధ్వంసం చేస్తే మార్కెట్‌ విలువకు రెట్టింపు జరిమానా వసూలు చేస్తామని.. వైద్యులు, ఆశావర్కర్లు, సిబ్బందికి రూ.50లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు జవదేకర్‌ వివరించారు.

కాగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌తో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ వివరాలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని మోడీకి వివరించారు. తమకు తగిన రక్షణ కల్పిస్తేనే తప్ప తాము ఆందోళనను ఏమాత్రం విరమించబోమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు తనతో చెప్పినట్లు షా… మోడీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ విషయంపై లోతుగా చర్చించిన కేంద్ర కేబినెట్ వైద్య సిబ్బందిపై దాడి జరిపితే ఇక కఠిన చర్యలు తప్పవని… అందుకోసం ఏకంగా ఆర్డినెన్స్ తీసుకు వచ్చేలా కేబినేట్ నిర్ణయం తీసుకుంది.