కరోనా ఎఫెక్ట్: వ్యాక్సిన్ వచ్చేంత వరకు క్రికెట్ కష్టమే…

కరోనా వైరస్ తో ప్రపంచమంతా గజగజ వణికిపోతుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా జరిగే అన్ని క్రీడాపోటీలు నిలిచి పోయాయి. మహమ్మారి తీవ్రత ఎప్పుడు తగ్గుతుందో.. టోర్నీలు ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి అన్నిచోట్లా నెలకొంది. దీంతో ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో పోటీలను నిర్వహించాలన్న ప్రదిపాదనలు వస్తున్నాయి. ఈ దిశగా జర్మనీలో మేజర్ ఫుట్బాల్ టోర్నీ బుందేస్లిగాను మే తొలివారం నుంచి ప్రేక్షకులు లేకుండా నిర్వహించనున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కూడా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్ల నిర్వహణ ప్రతిపాదనపై స్పందించింది. ఇది సాధ్యం కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

అంతేకాకుండా ‘భారత్, జర్మనీల సామాజిక పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయి. సమీప భవిష్యత్తులో భారత్లో క్రికెట్ ఉండదు. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్న సమయంలో ఏ క్రీడా పోటీలు జరగవని అనుకుంటున్నాం’ అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. అదేవిధంగా టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు. కాగా ‘ఐపీఎల్ కోసం జట్టు ప్రయాణిస్తే.. విమానాశ్రయాలు, హోటళ్లు, స్టేడియం బయట చాలా మంది జనాలు గుమికూడతారు.

భౌతిక దూరం కచ్చితమైన పరిస్థితుల్లో.. వారిని నిలువరించడం అసాధ్యం,. కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు క్రికెట్ జరుగకపోవచ్చు’ అని భజ్జీ తెలిపారు. ఫుట్బాల్ పోటీలు ప్రేక్షకులు లేకుండా నిర్వహించినా టీవీ సిబ్బందితో పాటు మిగతా విభాగాల సిబ్బంది వందల సంఖ్యలో పని చేయాల్సి ఉంటుందని అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య(ఏఐఎఫ్) అధ్యక్షుడు సుబ్రతా దత్ వెల్లడించారు. అందులో ఎవరికి కరోనా ఉన్నా కష్టమౌతుందని దత్ స్పష్టం చేయడం విశేషం.