ఇక చాలు కొంతకాలం చిల్లర రాజకీయాలు ఆపండి : పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో ఓ పక్క కరోనా వైరస్ తీవ్రస్థాయిలో దాడి చేస్తుంటే రాజకీయ పార్టీల మధ్య వివాదాలు మాత్రం తీవ్రస్థాయిలో ఊపందుకున్నాయి. తాజాగా ఏపీలో కరోనా టెస్ట్‌ల కోసం దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ కిట్స్ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ కిట్స్ ధర అంశం పెద్ద దుమారం రేపింది. అధికార వైసీపీ నేతలను బీజేపీ నేతలు టార్గెట్ చేస్తే.. బీజేపీ చీఫ్‌పై సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ నేతలు. దీంతో.. సవాళ్లు, ప్రతిసవాళ్లు.. ప్రతిజ్ఞలు ఇలా.. రోజుకో రకమైన సంచలనాలు చోటు చేసుకున్నాయి.

అయితే ఇలాంటి సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నివారణపై కంటే రాజకీయ ప్రత్యర్థులపైనే కొందరు అధికార పార్టీ పెద్దలు దృష్టి పెడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరమని వెల్లడించారు. గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల ప్రజలు పెరుగుతున్న పాజిటివ్ కేసులు చూసి బెంబేలెత్తిపోతున్నారని… ఇటువంటి విపత్కర పరిస్థితిలో…. తప్పులు వేలెత్తి చూపేవారిపై బురదజల్లే కార్యక్రమాన్ని అధికార పార్టీ పెద్దలు కొనసాగిస్తున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు ఇందులో భాగంగానే ఉన్నట్లుగా అర్థమౌతుందని.. తెలిపిన పవన్ కల్యాణ్.. ఆయనపై జరుగుతున్న దాడిని.. ప్రజాస్వామ్యవాదులు ఖండించవలసిన రీతిలో ఉన్నాయని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆయన.. ఆయనకు క్షమాపణలు చెప్పాలని అడిగే స్థాయిలో వ్యాఖ్యలు ఉన్నాయని వివరించారు. అలాగే.. ఇకనైనా ఈ కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని.. ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయేంత వరకు రాజకీయాలను పక్కన పెట్టి…. చిల్లర రాజకీయాలకు దూరంగా ఉండి మహమ్మారిపై పోరాడదామని.. అన్నారు. అలాగే.. ప్రజలను రక్షించుకోవడం, వారి సంక్షేమం, అవసరాలు, ఆకలిదప్పులు తీర్చడంపై మన శక్తియుక్తుల్ని కేంద్రీకరిద్దామని పవన్ కల్యాణ్ తెలిపారు. కాగా ఇప్పటివరకు అయ్యింది చాలని.. ఈ సమయంలోనైనా రాజకీయాలు ఆపకపోతే ప్రజలు తిరగబడే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.