నిద్రమత్తు: బ్రిడ్జిపై నుంచి నదిలో పడ్డ కారు.. ఐదుగురు మృతి….

కరోనా కాలంలో లాక్ డౌన్ సడలింపుల కారణంగా దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రజలు మళ్లీ రోడ్డెక్కడంతో రవాణా సమయంలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నయి. జార్ఖండ్‌లో మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధన్‌బాద్‌ జిల్లా గోవింద్‌పుర్‌ బర్వాలో ఖుడియా నది బ్రిడ్జి పైనుంచి వెళ్తున్న కారు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

కాగా ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి, మహిళతో పాటు ఐదుగురు మృతి చెందారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే స్థానికుల సహాయంతో మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అలాగే… ఆ కారు జార్ఖండ్‌ నుంచి కోల్‌కతా వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కారు డ్రైవర్‌ నిద్ర మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని.. పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు వెల్లడించారు.