కోట్లు సంపాదించి పెడుతున్న కరోనా నివారణ మందులు

కోట్లు సంపాదించి పెడుతున్న కరోనా నివారణ మందులు

కరోనా… కొత్త శత్రువు.. లక్షణాలు తెలియవు.. ఎంత మందికి వ్యాపించిందో.. ఎలా వ్యాపిస్తుందో తెలియదు.. కాని కరోనా కలవరపెడుతోంది. కోట్ల జనాభా ఉన్న దేశాలలో, రాష్ట్రాలలో ఏ ఒక్కరికో సోకి మిగిలిన వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇదంతా కరోనా నాణేనికి ఒక వైపు. మరోక వైపు మాత్రం కరోనా కాసులు కురిపిస్తోంది. ఈ వ్యాధిని అడ్డం పెట్టుకుని మెడికల్ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ప్రజల భయమే పెట్టుబడిగా కరోనా నివారణ మందులు కోట్ల రూపాయలు సంపాదించి పెడుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో కరోనా వైద్య శిబిరాలు వెలిసాయి. ఈ వైరస్ కు సంబంధించి పూర్తి స్దాయి పరిశోధనలు జరగక ముందే కరోనా నివారణ పేరుతో మందుల వ్యాపారం దినదినాభివ్రుద్ది చెందుతోంది. మరో వైపు ప్రజలు మాస్క్ ల వైపు పరుగులు పెడుతున్నారు.

ఈ వ్యాపారం కూడా కోట్ల రూపాయలకు చేరుతున్నట్లు చెబుతున్నారు. హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదం, నాచురోపతి ఇలా అన్ని విభాగాల నుంచి కరోనా నివారణ మందులు హాట్ కేక్కుల్లా అమ్ముడైపోతున్నాయి. ఏ మందు దేనికి పనికి వస్తుందో, ఈ వ్యాధికి అసలు మందు ఉందో లేదో తెలియని స్ధితిలో వైద్యులు, వ్యాపారులు కరోనా నివారణ మందులు పేరుతో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలలో భయమే పెట్టుబడిగా కరోనా మందుల వ్యాపారం ఘనంగా జరుగుతోంది. మీడియా కూడా కరోనాపై కొత్త కొత్త కథనాలు ప్రచురిస్తు ప్రజల భయాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఐదు కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో ఒక్కరికి ఈ వైరస్ సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. కాని మీడియా చేసిన హడావుడి మాత్రం అంతాఇంతా కాదు. కొన్ని వందల.. వేల మందికి ఈ వ్యాధి సోకినట్లు భ్రమించేలా కథనాలు ఇస్తున్నారు. వటుడింతై అన్నట్లు ఆ భయం నానాటికి పెరిగి వైద్య వ్యాపారులకు కోట్లు కురిపించడం విషాధం. ప్రభుత్వం కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలంమవుతోంది.