గూగుల్ సీఈఓ సుందర్ పిచయ్‌పై యూపీలో కేసు నమోదు చేశారు. గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కించపరిచేలా ఉన్న ఒక వీడియోను యూట్యూబ్‌లో ఒకరు పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఐదు లక్షల మందికి పైగా వీక్షించారు. వాట్సాప్ గ్రూపులో విస్తృతంగా వైరల్ అవుతున్న ఈ వీడియోపై వారణాసికి చెందిన ఒక వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేయగా ఆయనకు 8,500కు పైగా బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో ఆయన భెలుపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఎఫ్‌ఐఆర్‌లో సుందర్ పిచాయ్, ముగ్గురు గూగుల్ ఇండియా అధికారులతో పాటు మరో 17 మందిపై ఫిబ్రవరి 6న ఉత్తర ప్రదేశ్ లోని భెలూపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కానీ, తర్వాత టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచయ్‌తో పాటు భారత్‌లోని ముగ్గురు గూగుల్ ఉద్యోగుల పేర్లను పోలీసు అధికారులు ఈ కేసు నుంచి తొలగించారు. ఈ వీడియోకు వారికి ఎలాంటి సంబంధం లేదని తెలియడంతో వారి పేర్లను తొలగించినట్లు పోలీసులు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో గాజీపూర్ జిల్లాకు చెందిన సంగీతకారులు, వీడియో సాంగ్ రూపొందించిన రికార్డింగ్ స్టూడియో, స్థానిక మ్యూజిక్ కంపెనీతో ఇతరుల పేర్లు ఉన్నాయి.