బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న సుశాంత్ తండ్రి కృష్ణ కుమార్ సింగ్ ఫిర్యాదు మేరకు హీరో స్నేహితురాలు రియా చక్రవర్తి మీద పట్నాలోని రాజీవ్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. రియాతో పాటు ఆమె కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం ఆరుగురి మీద కేసు నమోదు చేశారు.
వికాస్ సింగ్ మాట్లాడుతూ.. ‘అంతేకాక ముంబై పోలీసులు రియాను వదిలి పెట్టండి.. ప్రొడక్షన్ హౌస్‌ల మీద ఆరోపణలు చేయండి అంటూ సుశాంత్ కుటుంబ సభ్యులు మీద ఒత్తిడి తెస్తున్నారు. ముంబై పోలీసులు కేసును దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. లాజికల్ ఎండ్ కోసం ప్రయత్నించడం లేదు. రియా వచ్చాకే సుశాంత్ కుటుంబ సభ్యులు అతడిని కలవలేకపోయారు. నేరం కూడా అప్పుడే ప్రారంభమయ్యింది. రియా ఉద్దేశపూర్వకంగానే సుశాంత్‌ను కొంతకాలం పాటు అతడి తండ్రితో మాట్లాడకుండా ఆపింది.
ఈ పరిస్థితులను చూసి ఆందోళన చెందిన సుశాంత్ కుటుంబ సభ్యులు అతడి చుట్టూ ఉన్నవారు మంచి వారు కారని ఫిబ్రవరి 25న బాంద్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుశాంత్ కుటుంబం రియాపై సుదీర్ఘమైన కేసు నమోదు చేసింది. ఆమె అతడి మనస్సును ఎలా చేంజ్ చేసింది.. సుశాంత్ ఇంట్లో పని చేసేవారిని, బాడీ గార్డులను మార్చిన అంశం గురించి.. అతడి అకౌంట్ నుంచి డబ్బును ఎలా డ్రా చేసింది.. అతడి క్రెడిట్ కార్డ్స్‌ను ఎలా వాడుకుంది వంటి అంశాల గురించి పోలీసులకు తెలిపారు’ అన్నారు వికాస్ సింగ్.
వికాస్ సింగ్ మాట్లాడుతూ.. ‘అంతేకాక సుశాంత్ సేంద్రియ వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు.. కుర్గ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు రియా, సుశాంత్ వెంట లేదు. అతడిని విడిచి పెట్టింది. నిజంగా ఆమె అతడిని జాగ్రత్తగా చూసుకుంటే.. ఎలా వదిలేసి వెళ్తుంది’ అని సుశాంత్ లాయర్ ప్రశ్నించాడు. అంతేకాక ‘రియా అతడిని వైద్యుల వద్దకు తీసుకెళ్లింది. వైద్యం చేయించింది. కానీ సుశాంత్ కుటుంబ సభ్యులకు దీని గురించి ఏం తెలియదు. వారు ఎప్పుడు అతని వెంట ఆస్పత్రికి వెళ్లలేదు. చివరకు అతను ఏ మందులు తీసుకోవాలన్నది కూడా రియానే నిర్ణయించింది.
మా అనుమానం ఏంటంటే సుశాంత్ సాధారణమైన మందులు కాక కొన్ని తీవ్రమైన మందులు వాడి ఉంటాడు అని భావిస్తున్నాం’ అంటూ వికాస్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి బిహార్ పోలీసులు కూడా మొదట్లో భయపడ్డారని లాయర్ తెలిపారు. కానీ తర్వాత ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మంత్రి సంజయ్ జోక్యం చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేలా చేశారని తెలిపారు. ఈ కేసును పట్నా పోలీసులు విచారించాలని కోరుతున్నామన్నారు. సుశాంత్ కుటుంబం సీబీపై దర్యాప్తుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వికాస్ సింగ్ తెలిపారు. రియాను అరెస్ట్ చేయాలని సుశాంత్ కుటుంబం భావిస్తోంది. ఈ రోజు రియాను అరెస్ట్ చేస్తారని మేము నమ్ముతున్నాం’ అన్నారు వికాస్ సింగ్.