ప్రేమించి పెళ్లి చేసుకుని వేధిస్తున్నాడనే ఫిర్యాదు మేరకు ఫైజాన్ అనే యువకుడిపై కేసు నమోదు చేసినట్లు రాయచోటి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. నిందితుడిపై గత సంవత్సరం సెప్టెంబర్ 28న ఐపీసీ 498ఏ, డిసెంబర్ 15న వారి కుటుంబ సభ్యులపై 498ఏ, 506 వరకట్న కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు చెప్పారు. గురువారం డీఎస్పీ శ్రీధర్ విలేకరులకు వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్‌కు చెందిన యువతి ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తుండగా రాయచోటికి చెందిన ఫైజాన్ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నాంటూ దగ్గరయ్యాడు. తరువాత ఆమెతో కలసి ఉన్న ఫొటోలను చూపించి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. బాధితురాలు కడప దిశా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడు ఆమెను వివాహం చేసుకున్నాడు.
పెళ్లయిన కొన్ని రోజుల తరువాత హింసిస్తున్నాడంటూ ఆమె మరోసారి రాయచోటి దిశా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడితో పాటు అతని కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసినట్లు రాయచోటి డీఎస్పీ తెలిపారు. దీనిపై చార్జీషీట్ కూడా దాఖలు చేశామన్నారు. ఈ కేసులో మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనతో ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం అనే నేరంపై ఐపీసీ 307, 506, 66ఈ, 66 ఐటీ యాక్టు కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఆయన చెప్పారు.