ముఖ్యమంత్రి పై సీబీఐ దర్యాప్తు

ముఖ్యమంత్రి పై సీబీఐ దర్యాప్తు

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌పై అవినీతి ఆరోపణల కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించడంతో ఆయన సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ త్రివేంద్ర సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీబీఐ దర్యాప్తును ఆదేశిస్తూ నైనిటాల్ హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులపై స్టే విధించింది.

అటువంటి ఆదేశాల కోసం పిటిషనర్ కోరలేదని, ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వకుండా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని సుప్రీంకోర్టు పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులు తీవ్రంగా ఉన్నాయని, ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందని వ్యాఖ్యానించింది. కేసు వివరాల్లోకి వెళితే.. 2016లో ఝార్ఖండ్‌లోని ‘గో సేవా ఆయోగ్‌’ అధ్యక్ష పదవి కోసం అమృతేష్‌ చౌహాన్‌ అనే వ్యక్తి.. నాటి బీజేపీ ఇన్‌ఛార్జి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ బంధువుల ఖాతాల్లోకి నగదు పంపారని స్థానిక మీడియా సమాచార ప్లస్ జర్నలిస్ట్ ఉమేష్‌ శర్మ ఆరోపించారు.

ఇవి నిరాధారమైనవని పేర్కొంటూ రావత్‌ బంధువుగా భావిస్తున్న వ్యక్తి ఉమేష్‌ శర్మపై ఫిర్యాదు చేశారు. దీంతో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ ఉమేష్‌ శర్మ నైనిటాల్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. జర్నలిస్టుపై నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది. అనంతరం ఉత్తరాఖండ్‌ సీఎంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. కాగా, ఇదొక ‘చట్ట తప్పిదం’ అని న్యాయస్థాన తీర్పును బీజేపీ ఖండించింది. హైకోర్టు తీర్పును అనుసరించి.. ముఖ్యమంత్రి పదవికి రావత్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.