మణిపూర్ విద్యార్థుల హత్య కేసులపై సీబీఐ దర్యాప్తు..!

CBI investigation on murder cases of Manipur students..!
CBI investigation on murder cases of Manipur students..!

జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే ఆ రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు. ఆ రాష్ట్రంలో గతంలో జరిగిన దారుణాలన్నీ ఇంటర్నెట్ పునరుద్ధరించినప్పటి నుంచి వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో 17 ఏళ్ల అమ్మాయి, 20 ఏళ్ల అబ్బాయిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. వారి ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో ఒక్కసారిగా దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మళ్లీ.. మణిపుర్ ప్రభుత్వం ఇంటర్నెట్​పై మళ్లీ నిషేధం విధించింది. పాఠశాలలకు కూడా శుక్రవారం వరకు సెలవులు ప్రకటించింది.

మరోవైపు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ స్పందించారు. ఆ విద్యార్థులను హత్య చేసిన నిందితులను వదిలేదే లేదని స్పష్టం చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు సీబీఐ బృందం ఈరోజు ఇంఫాల్​కు చేరుకోనుందని.. సీబీఐ డైరెక్టర్​తో పాటు బృందం.. ప్రత్యేక విమానంలో ఇవాళ ఉదయం రాష్ట్రానికి రానున్నట్లు సీఎం బీరేన్ సింగ్ తెలిపారు. అత్యంత దారుణానికి పాల్పడ్డ హంతకులను కోర్టు ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని హామీ ఇచ్చారు.