రేపే అభ్యర్ధుల ప్రకటన…శంఖారావం పూరించనున్న బాబు !

cm-chandrababu-naidu-shok

ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి నెల రోజుల ముందు నుంచే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. 20 నుంచి 30 స్థానాలు మినహా అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తిచేసినట్టు సమాచారం. ఇక, అభ్యర్థుల వడపోత కొలిక్కిరావడంతో తొలి జాబితాను రేపు విడుదల చేయనున్నారు. ఈ జాబితాలో 100 నుంచి 140 మంది పేర్లతో ఈ జాబితాను ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు మార్చి 16 నుంచి ఎన్నికల ప్రచారానికి సమర శంఖారావం పూరించనున్నారు. శనివారం తొలుత తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం చిత్తూరు జిల్లా టీడీపీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం శ్రీకాకుళం బయలుదేరి వెళ్తారు. అక్కడ నేతలు, కార్యకర్తలతో సీఎం భేటీ అవుతారు. మార్చి 16 నుంచి 19 వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ చంద్రబాబు పర్యటిస్తారు. జిల్లాస్థాయి నేతలు మొదలు సేవామిత్ర, బూత్‌స్థాయి కన్వీనర్ల వరకూ పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించి, దిశానిర్దేశం చేయనున్నారు. ఈ పర్యటనలు ముగిశాక ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి, రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపడతారు. ఆయా జిల్లాల్లో బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహించనున్నారు. మార్చిన 16న చిత్తూరు, శ్రీకాకుళం, మార్చి 17న విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, మార్చి 18న నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, మార్చి 19న కర్నూలు, అనంతపురం, కడపలో పర్యటిస్తారు. ఈ తేదీల్లో మధ్యాహ్నం 1 నుంచి 2.30 గంటలు, సాయంత్రం 4 నుంచి 5.15 గంటలు, రాత్రి 7నుంచి 8 గంటలు మధ్య పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ 28 రోజులు ఎవరికీ విశ్రాంతి లేదని గెలుపే లక్ష్యంగా యుద్ధానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.