సెలబ్రిటీలు అస్సలు సమయాన్ని వృథా చేయరు. నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. అలాంటిది కరోనా దెబ్బకి.. మన స్టార్స్ అంతా ఇంట్లోనే కాలక్షేపం చేయాల్సి వస్తుంది. వీరు ఇంట్లో రకకాల విన్యాసాలు చేస్తున్నారు. అవి సోషల్ మీడియాలో పెట్టేసి వైరల్ చేస్తున్నారు. కరోనా వైరస్ తో ప్రపంచమంతా వణికిపోతుంది. ఎంతటివారైనా సరే ఇంటికే పరిమితమౌతున్నారు. అందులో సెలబ్రిటీలు అయితే దొరక్క దొరక్క దొరికిన సమయాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.
కొంతమంది కుటుంబంతో గడుపుతూ సామాజిక స్పృహను ప్రజలకు కలిగేలా జనాన్ని చైతన్య పరుస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో అన్ని రంగాలకి చెందిన పరిశ్రమలు అన్నీ మూతపడ్డాయి. ఇదే సమయంలో కొంతమంది స్టార్స్ వంట చేస్తుంటే.. మరికొంతమంది ఇంటి పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇంకొంతమంది. స్క్రిప్ట్ రాసుకుంటూ ఉంటే.. మరికొంతమంది.. పూర్తిగా పిల్లలతో ఆడుకుంటూ దర్శనమిస్తున్నారు. సహజంగా సినిమాకు.. సినిమాకు మధ్యలో వచ్చే విరామంలో ఫ్యామిలీతో హాలీడే ట్రిప్‌లు వేస్తుంటారు సినీస్టార్స్. కానీ…. ఇంట్లోనే భార్య, పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించలేరు.
అయితే కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ తో సినీ స్టార్స్, రాజకీయ నేతలు ఎంతో చైతన్యవంతంగా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ప్రముఖ సీనియర్ సినీనటి, ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రజలకు కరోనాపై మరింత అవగాహన పెంచేలా వినూత్నంగా రోజుకో రకమైన ధోరణులు అవలంభిస్తుంది. పోలీసులకు, వైద్యులకు ఓ రోజు ఆహారం వండిపెడితే… మరో రోజు వారి నియోజక వర్గమైన నగరి మొత్తాన్ని శానిటైజేషన్ తో ముంచేశారు. అలా వినూత్నంగా మరో రోజు వారి భర్త సెల్వమణితో ఆహారాన్ని వండుతూ… వండిస్తే.. చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. అలాగే.. నేచురల్ స్టార్ నాని తన కుమారుడు జున్ను (అర్జున్)తో ఆడుకుంటూ మధుర క్షణాలను గడుపుతున్నారు. అంతేకాకుండా సినీ కార్మికులకు విరాళాలు అందిస్తున్నారు. రెక్కాడితేగాని.. డొక్కాడని నిరుపేదలకు ఆసరాగా నిలుస్తున్నారు.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ‘కరోనా క్రైసస్ ఛారిటీని ప్రారంభించారు. ఈ చారిటీకి ఇప్పటికే చిరు రూ.కోటి రూపాయలు ఇచ్చారు. నాగార్జున రూ. కోటి, మహేష్ బాబు రూ.25లక్షలు, ఎన్టీఆర్ రూ.25లక్షలు, ఎన్టీఆర్ రూ.30లక్షలు అందించారు. అలాగే నాగ చైతన్య రూ.25లక్షలు, యంగ్ హీరో కార్తికేయ రూ.2 లక్షలు తమ తరపున విరాళాలు అందజేశారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు. తనకు తెలిసిన 60 మంది టెలివిజన్ కార్మికులకు ఒక నెలకు సరిపడా ఆర్థికసాయం చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తనదైన శైలిలో ఇంట్లో అంట్లు తోముతూ, ఇల్లు ఊడుస్తూ రకరకాల విన్యాసాలు చేస్తుంది. మొత్తానికి కరోనా ప్రభావంతో మన స్టార్స్ ఏదో ఒక పనిలో మునిగి తేలుతున్నారు.
అదేవిధంగా స్టార్ హీరోయిన్ తమన్నా.. ఇంటి వద్ద ఉండేవారికి బోర్ కొట్టకుండా కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. లాక్ డౌన్ అనేది అందరికి పరీక్షా సమయం లాంటిదని.. ఇలాంటి అప్పుడే మనం స్ట్రాంగ్ గా వుండాలని చెప్పింది. పెదవులపై చిరునవ్వు చెదరనీయ కూడదని.. ఇంట్లో వాళ్లతో భౌతిక దూరాన్ని పాటిస్తూనే ఆనందకరంగా వుండాలని తెలిపారు. అంతేకాకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏదో ఒక పని చేసుకోవాలని ఇవన్నీ తాను చేస్తున్నానని మీరు చేయమంటూ స్పష్టం చేసింది.
అలాగే.. కరోనాపై పోరాటంలో భాగంగా సెలబ్రిటీలు తమవంతు కృషి చేస్తూ ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రజలని చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా కరోనాపై అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ అందరూ కలిసి ఫ్యామిలీ అనే షార్ట్ ఫిలిం తీసారు. ఇప్పుడు నటుడు సాయి కుమార్ కూడా తనవంతుగా కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బంది సేవలని ప్రశంసిస్తూ..ఓ షార్ట్ ఫిలిం చేశాడు. సాయి కుమార్ తన కుమారుడు ఆది, కుమార్తె జ్యోతిర్మయితో కలిసి ఈ షార్ట్ ఫిలిం రూపొందించాడు. ఇందులో డాక్టర్ పాత్రలో జ్యోతిర్మయి, పారిశుద్ధ్య కార్మికుడి పాత్రలో ఆది, పోలీసు పాత్రలో సాయికుమార్ నటించారు.
పోలీస్, పబ్లిక్ ఒకటైతే కరోనాను తరిమి వేయగలమని, అంతిమ విజయం మనదే అంటూ సాయికుమార్ విశ్వాసం వ్యక్తం చేయడంతో పాటు ఇలాంటి విపత్కర సమయంలో విధి నిర్వహణలో ఈ మూడు విభాగాలు ఎంతో బాధ్యతాయుతంగా పని చేస్తున్నాయని.. వారికి ప్రజలు సహకరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. ఇలా మన సెలబ్రిటీలు కరోనా దెబ్బకి ఇంట్లో ఉంటూనే సమాజాన్ని చైతన్య పరుస్తుండటం విశేషమనే చెప్పాలి.