దేశ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఆదాయపు పన్ను శాఖ జూన్ 7 కొత్త ఐటీ పోర్టల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ పోర్టల్ లో సాంకేతిక సమస్యలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఐటీ పోర్టల్ ప్రారంభించి రెండున్నర నెలలు కావస్తున్న ఇంకా సాంకేతిక సమస్యలు వస్తుండటంతో కేంద్రం ఇన్ఫోసిస్ సీఈఓపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోర్టల్ లో ఇంకా ఎందుకు చాలా సమస్యలు కొనసాగుతున్నాయో ఆడగటానికి ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ను ఆర్థిక మంత్రిత్వ శాఖ పిలిచినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
“ఆగస్టు 21 నుంచి సైట్ ఎందుకు అందుబాటులో లేదు, కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ ప్రారంభించిన 2.5 నెలల తర్వాత కూడా ఇంకా ఎందుకు సాంకేతిక సమస్యలు ఎందుకు పరిష్కరించలేదో తెలియజేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్”కు సమన్లు జారీ చేసింది. పన్ను చెల్లింపుదారులు, పన్ను నిపుణులు,ఇతర భాగస్వాములు తెలియజేసిన ఈ-ఫైలింగ్ పోర్టల్ సమస్యలపై కేంద్రం ఇన్ఫోసిస్ ను ప్రశ్నించింది.
ఈ సమస్యల గురించి గత వారం సీతారామన్ మాట్లాడుతూ.. “కొత్త సైట్ లో సమస్యలు రాబోయే రెండు-మూడు వారాల్లో పూర్తిగా పరిష్కారం కానున్నట్లు” అన్నారు. “నేను ఇన్ఫోసిస్ కు నిరంతరం గుర్తు చేస్తున్నాను, ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నందన్ నీలేకని దానిని పరిష్కరిస్తామని నాకు హామీలు ఇస్తున్నారు” అని ఆమె తెలిపారు. 2019 జనవరి నుంచి 2021 జూన్ మధ్య కాలంలో ఈ పోర్టల్ అభివృద్ధి చేసినందుకు ఇన్ఫోసిస్ కు ప్రభుత్వం ₹164.5 కోట్లు చెల్లించింది.