ఆధార్ డేటా చోరీ పై క్లారిటీ ఇవ్వాలని ప్రశ్నించిన కేవీపీ రామచంద్రారావు

ఆధార్ డేటా చోరీ పై క్లారిటీ ఇవ్వాలని ప్రశ్నించిన కేవీపీ రామచంద్రారావు

సార్వత్రిక ఎన్నికలకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన ఆధార్ డేటా చోరీ కేసు వీగిపోయింది. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న ఐటీ గ్రిడ్ సంస్థ… ఆధార్ డేటాను చోరీ చేయలేదని తేలిపోయింది. అంటే… ఏపీకి చెందిన అప్పటి విపక్షం వైసీపీకి చెందిన నేతలు ఫిర్యాదు చేస్తే… కేసు నమోదు చేసి పోలీసులను పరుగులు పెట్టించిన తెలంగాణ సర్కారు ఈ వ్యవహారంలో నానా యాగీ చేశాయే తప్పించి అసలు డేటా చోరీనే జరగలేదని తేలిపోయింది. ఈ మాట అన్నది సాక్షాత్తు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారే. అంతేనా… కేంద్ర ప్రభుత్వం ఈ మాటను పార్లమెంట్లు సాక్షిగా చెప్పేయడం సంచలనాలకే సంచలనమని చెప్పాలి.

సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైన సమయంలో ప్రజల ఆధార్ డేటాను తస్కరించిన ఏపీలోని అప్పటి టీడీపీ ప్రభుత్వం దానిని… తనను అత్యంత సన్నిహితంగా మెలగే ఐటీ గ్రిడ్ కు ఇచ్చి… దానితో ప్రజలను మభ్యపెట్టే యత్నం చేశారని, టీడీపీకే ఓటేసేలా ప్రజలను ఒత్తిడి చేశారని,  టీడీపీకి ఓటేసే అవకాశం లేని వారికి సంక్షేమ పథకాలు అందకుండా చేశారని నాడు వైసీపీ ఆరోపణలు గుప్పించింది. కేసు ఏపీకి చెందినదే అయినా… ఈ నేరానికి పాల్పడిన సంస్థ ఐటీ గ్రిడ్ సంస్థ కార్యాలయం హైదరాబాద్ లోనే ఉండటం, ఈ మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే జరిగిందన్న ఆరోపణలతో వైసీపీ ఫిర్యాదు అందగానే… కేసీఆర్ సర్కారు కేసు పెట్టేసింది. అంతేకాకుండా ఈ కేసు విచారణ కోసం సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను కూడా ఏర్పాటు చేసింది. ఐటీ గ్రిడ్ యజమాని అశోక్ కోసం సిట్ జరిపిన వేట కూడా ఆసక్తి రేకెత్తించింది.

ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత, నాటి ఏపీ విపక్ష నేత నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం కలకలమే రేపింది. అయితే ఎన్నికల ప్రచారం హోరెత్తిన నేపథ్యంలో ఈ కేసు మూలనపడిపోగా… ఎన్నికల ఫలితాల తర్వాత దీనిని ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఆధార్ డేటా చోరీ అయ్యిందా? లేదా? అన్న విషయంపై క్లారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు ఓ ప్రశ్నను సంధించారు.

ఈ ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి సంజయ్ ధాత్రే క్లారిటీగానే సమాధానం ఇచ్చారు. ఆధార్ డేటాను ప్రైవేట్ సంస్థలకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని మంత్రి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆధార్ డేటా చోరీ ఉత్పన్నమయ్యే సమస్యే లేదని కూడా ఆయన ప్రకటించారు. దీంతో ఐటీ గ్రిడ్ పై నమోదైన డేటా చోరీ కేసు పూర్తిగా నిరాధారమని కేంద్రమే చెప్పేసినట్టైంది.