కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగడానికి గల కారణాలు దర్యాప్తు చేయడానికి రాష్ట్రానికి కేంద్ర జలశక్తి శాఖ నియమించిన బృందం వచ్చిన విషయం తెలిసిందే. అసలు బ్యారేజీ వంతెన కుంగడానికి కారణమేంటి.. ? బ్యారేజీకి ముప్పు పొంచి ఉందా? నిర్మాణంలో ఏమైనా లోపాలున్నాయా అనే విషయాలపై ఈ బృందం వివరాలు సేకరించింది. డామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బృందం… మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి.. రెండు గంటల పాటు వంతెన కుంగేందుకు గల కారణాలను అన్వేషించింది.
18 నుంచి 21 పిల్లర్ల వరకు నడిచి వంతెన ఏ మేరకు కుంగిందో వివరాలు సేకరించి.. 20వ పిల్లర్ వద్ద పగుళ్లను, గేట్‌ను ప్రత్యక్ష్యంగా పరిశీలించారు. 20వ పిల్లర్ మరింత కుంగిపోవడం వల్ల పక్కన ఉన్న పిల్లర్లపై పడే భారాన్ని బృందం సభ్యులు గమనించారు. పిల్లర్ కుంగటం వల్ల… బ్యారేజీకి ఏమైనా నష్టం వాటిల్లే అవకాశం ఉందా అనే అంశంపై ఆరా తీసి.. కుంగిన వంతెన పిల్లరు, పగళ్లు ఏర్పడిన దిగువ భాగాన్ని ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. సమగ్ర పరిశీలన పూర్తయ్యాక క్యాంపు కార్యాలయంలో ఎల్ అండ్ టీ, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమై బ్యారేజీ సామర్థ్యం, డిజైన్ తదితర విషయాలకు సంబంధించిన సమాచారాన్ని తీసుకున్నారు.
మరోవైపు ఇవాళ కేంద్ర బృందం రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం కానుంది. మేడిగడ్డ ఆనకట్ట వ్యవహారంపై ఇంజినీర్లతో చర్చించనున్నారు. సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజినీర్ అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం.. ఆనకట్ట డిజైన్లు, సాంకేతికపరమైన అంశాలపై చర్చించనుంది.