కరోనా వ్యాక్సిన్ రెండు డోస్‌లు వేసుకున్న వారికి ప్రభుత్వం నగదు ఇస్తోందంటూ నమ్మబలికిన ఓ వ్యక్తి వృద్ధురాలి నోటికి ప్లాస్టర్ వేసి మూడున్నర తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన ఇది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చిన్న పోచారం గ్రామంలో గురువారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.చిన్న పోచారం గ్రామానికి చెందిన రామసహాయం వసుమతి ఇంట్లో ఒంటరిగా ఉంటోంది.
ఈక్రమంలో గురువారం మధ్యాహ్నం వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కరోనా టీకా రెండు డోసులు వేసుకున్నారా అంటూ ప్రశ్నించాడు. దీనికి ఆమె టీకా వేయించుకున్నట్లు సమాధానం చెప్పగా.. ప్రభుత్వం రూ.వెయ్యి నగదు ఇవ్వమని పంపించిందని జేబులోని నగదు తీసి ఇచ్చాడు.అనంతరం ఫొటో తీసుకోవాలని చెబుతూ కుర్చీలో కూర్చున్న ఆమె ఫొటో తీస్తున్నట్లు నటిస్తూ నోటికి ప్లాస్టర్ వేశాడు.
ఆ వెంటనే ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు గొలుసు లాక్కుని పారిపోయాడు. తేరుకున్న వృద్ధురాలు బయటకు వచ్చి స్థానికులకు చెప్పగా వారు పోలీసులకు సమాచారం అందించారు. శిక్షణ ఎస్సై విజయ్‌కుమార్ గ్రామానికి చేరుకుని బాధిత మహిళతో మాట్లాడి వివరాలు సేకరించారు. కాగా, అదే దుండగుడు బుధవారం మధ్యహ్నం కూడా తన ఇంటికి వచ్చి టీకా వేసుకున్నారా అని అడిగి వెళ్లినట్లు మరో మహిళ చెప్పింది. దీంతో పక్కాగా రెక్కీ నిర్వహించాకే చోరీకి పాల్పడినట్లు భావిస్తున్నారు.