వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నగరంలో గత కొన్నిరోజులుగా పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు. రెండు రోజుల క్రితం ఆటో చోరీ కాగా, అశోక్‌నగర్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలు సత్తెమ్మ మెడలోని బంగారు గొలుసును బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు వచ్చి లాక్కెళ్లారు. ఇద్దరు దుండగుల్లో ఒకరు హెల్మెట్ ధరించగా, మరొకరు మాస్క్ పెట్టుకున్నారు. మంచిర్యాల చౌరస్తా మీదుగా వచ్చి అశోక్ నగర్లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
7 తులాల బంగారు గొలుసు చోరీ జరిగినట్లు వృద్ధురాలు సత్తెమ్మ పోలీసుల కు పిర్యాదు చేశారు. దీని ఆధారంగా దుండగుల ఫోటోలను పోలీసులు రిలీజ్ చేశారు. వీరి ఆచూకి తెలిపిన వారికి నగదు ప్రోత్సాహం ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అదే విధంగా గతనెల 8న స్టార్ హాస్పిటల్ వద్ద ఉంచిన ఆటోను ఎత్తుకెళ్ళిన్నట్లు పోలీసులు తెలిపారు. దొంగలు నిజామాబాద్ నుంచి పెర్కిట్ వరకు బైక్ పై వచ్చి అక్కడి నుంచి బస్ లో కరీంనగర్ కు చేరుకుని ఆటోను తీసుకుని నిజామాబాద్ వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయినట్లు ఫోటోలు విడుదల చేశారు. మారుతి సుజు ఆటో గురించి తెలిపినవారికి 25000 పారితోషికం ఇస్తామని ప్రకటించారు. దుండగుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.