తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో మేనిఫెస్టో సిద్దం చేసేందుకు కాంగ్రెస్ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అనేక వర్గాలతో మేనిఫెస్టో కమిటీ భేటీ అయ్యింది.మరోసారి ఛైర్మన్ శ్రీధ్‌ర్ బాబు అధ్యక్షతన గాంధీ భవన్ సమావేశమైంది. ఇప్పటివరకు వచ్చిన విజ్ఞప్తులను క్రోడీకరించి పార్టీకి మేలు జరిగేలా మేనిఫెస్టో తయారుచేసేలా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ఆదాయ, వ్యయాలు దృష్టిలో ఉంచుకొని అమలు చేయగలిగే హామీలు మాత్రమే ఇవ్వాలని మేనిఫెస్టో కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తమ వద్దకు వచ్చిన విన్నపాలు, ఇప్పటివరకు పార్టీ ప్రకటించిన యువ, వ్యవసాయ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లు, చేయూత పెన్షన్ పథకం, ఆరు హామీల గ్యారంటీ కార్డులతోపాటు త్వరలో ప్రకటించనున్న బీసీ, మహిళ డిక్లరేషన్లను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. బస్సు యాత్రలో మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉండడంతో అప్పటికే సిద్దం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.