అమరావతిని అడ్రస్‌ లేకుండా చేశారని ప్రభుత్వంపై మండిపడ్డ చంద్రబాబు

అమరావతిని అడ్రస్‌ లేకుండా చేశారని ప్రభుత్వంపై మండిపడ్డ చంద్రబాబు

వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని నిలిపేయడం పట్ల చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి పర్యటనలో బాబు అమరావతి ఆగిపోతే ప్రాజెక్టులు రావు, సంపద ఉండదన్నారు. రాజధాని నిర్మాణానికి డబ్బులు లేవన్న వైఎస్ఆర్సీపీ నేతల వ్యాఖ్యల పట్ల ఆయన మండిపడ్డారు.

రాజధాని ఆగిపోతే తెలుగు రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన అమరావతిని అడ్రస్‌ లేకుండా చేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు. అమరావతిని సక్రమంగా నిర్వహిస్తే లక్ష కోట్ల ఆదాయం వచ్చేదని బాబు చెప్పారు.

అమరావతి మీద ఇప్పుడు కమిటీలు వేయడం ఏంటని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. సింగపూర్‌ లాంటి దేశం వెనక్కి పోతే పెట్టుబడులు ఎవరు పెడుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటికీ ఇసుక దొరకడం లేదన్నారు.

ఇసుక పాలసీ పేరుకే ఉందన్న చంద్రబాబు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్న ఇసుక అక్రమ రవాణాను నిరోధించలేరా అని జగన్ సర్కారును ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోకి అక్రమంగా తరలిస్తున్న నాన్ డ్యూటీ లిక్కర్‌ను అడ్డుకోలేరా నాటుసారా, కల్తీ మద్యం అమ్మకాలకు అడ్డుకట్ట వేయలేరా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.