ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన అమరావతి పరిరక్షణ సభకు హాజరైన చంద్రబాబు అమరావతిని మార్చే అధికారం సీఎం జగన్‌కు లేదని అన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఇప్పటివరకు 37 మంది చనిపోయారని ఇవ్వన్ని ప్రభుత్వ హత్యలే అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై, మహిళలపై పోలీసులతో లాఠీ చార్జ్ చేయించారని మండిపడ్డారు.

ఆనాడు తాము అడ్డుకుంటే జగన్‌ రాష్ట్రంలో తిరిగేవారా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు చిల్లర రౌడీలుగా మారి జేఏసీ శిబిరాన్ని కాల్చుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని, వైసీపీ సభలకు, ర్యాలీలకు అనుమతి ఇస్తూ, టీడీపీ సభలకు మాత్రం ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదని అన్నారు. తాను స్వార్ధం గురుంచి ఆలోచించి ఉంటే తిరుపతిలోనే రాజధానిని పెట్టేవారమని, అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉంటుందన్న కారణంగానే అమరావతిని రాజధానిగా ప్రకటించామని అన్నారు. అమరావ్తిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పడం కాదని, దమ్ముంటే నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఓ వ్యక్తిపై కోపంతో రాజధాని మార్చడం సరికాదని ఎందరో తప్పుపట్టినా జగన్ తుగ్లక్‌కి జ్ఞానోదయం కాలేదని అన్నారు.