కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌

కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌

పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న నలుగురు దోషులపై ఢిల్లీ హైకోర్టు బుధవారం తీర్పును వెల్లడించనుంది. ఆ నలుగురు కామాంధులకు ఉరిశిక్షను అమలు చేయకుండా పటియాలా న్యాయస్థానం స్టే జారీ చేయడాన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌ ఈ మధ్యాహ్నం ఢిల్లీ హైకోర్టు సమక్షానికి విచారణకు రానుంది.

ఒకే తరహా నేరానికి పాల్పడిన నలుగురు కామాంధులకు ఒకే తరహా శిక్షను విధించినప్పటికీ.. వేర్వేరుగా ఉరి తీయాలనే తీహార్ జైలు అధికారులు నిర్ణయాన్ని తప్పు పడుతూ దాఖలైన పిటషన్‌పై విచారణ నిర్వహించిన అనంతరం పటియాలా న్యాయస్థానం స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 1వ తేదీన ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉండగా .. ఒక్క రోజు ముందే స్టే జారీ అయింది. ఫలితంగా- నిర్భయ కేసు నిందితుల ఉరితీత.. రెండోసారి వాయిదా పడింది.

పటియాలా న్యాయస్థానం స్టే ఇవ్వడాన్ని తప్పు పడుతూ ఆ మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ పూర్తి చేయడంతో పాటు డెత్ వారెంట్‌ను కూడా జారీ చేయడానికి అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే- అక్షయ్ కుమార్ ఠాకూర్ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటీషన్ రాష్ట్రపతి భవన్‌లో పెండింగ్‌లో ఉన్నందున.. అతణ్ని మినహాయించి మిగిలిన వారిని ఉరి తీయాలా? వద్దా? అనే అంశంపైనా ఢిల్లీ హైకోర్టు స్పష్టత ఇవ్వనుంది.