Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఫిబ్రవరి 25…ఈ తేదీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. సరిగ్గా 40 ఏళ్ల క్రితం అంటే 1978 ఫిబ్రవరి 25న జరిగిన ఎన్నికతోనే తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు రూపంలో ఓ కొత్త శకం మొదలయింది. చంద్రబాబునాయుడు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయింది ఈ రోజే. అప్పట్లో ఎస్వీయూనివర్శిటీలో చదువుకుంటున్న చంద్రబాబు ఇందిరాగాంధీ ఆహ్వానం మేరకు రాజకీయాల్లో ప్రవేశించారు. ఎమర్జెన్సీ, అనంతర పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ ముక్కలయి…హస్తం గుర్తుతో ఇందిరా కాంగ్రెస్ ఏర్పాటయింది. కాంగ్రెస్ సీనియర్లు చాలా మంది ఒరిజినల్ కాంగ్రెస్ లోనే ఉండిపోగా, ఇందిర వెంట కొంతమంది మాత్రమే నడిచారు.
రాష్ట్రంలో ఇందిరా కాంగ్రెస్ కు పట్టులేని సమయమది. ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకని దుస్థితి. అయితే క్లిష్టసమయాల్లో కాంగ్రెస్ కు వెన్నుదన్నుగా ఉన్న ఏపీని వదులుకోవడానికి సిద్ధంగా లేని ఇందిరాగాంధీ యువమంత్రం పేరుతో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఉత్సాహవంతులైన యువతకు 20 శాతం సీట్లు ఇస్తామని ప్రకటించారు. అయినప్పటికీ ఇందిర కాంగ్రెస్ లోకి రావడానికి ఎవరూ ఉత్సాహం చూపలేదు. అలాంటి పరిస్థితుల్లో ఇందిర పిలుపునందుకుని రాజకీయాల్లోప్రవేశించారు చంద్రబాబు. అప్పటికి చంద్రబాబు గురించి ఎవరికీ తెలియదు. అయినా ఇందిరా కాంగ్రెస్ కు అంతకు మించిన ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆయనకే టికెట్ దక్కింది.
జనతా పార్టీ తరపున, చంద్రబాబుకు ప్రత్యర్థిగా చిత్తూరు జిల్లాలో ఎంతో పేరు ప్రఖ్యాతలున్న పట్టాభిరామ చౌదరి పోటీచేస్తున్నారు. చిత్తూరు ఇందిరాకాంగ్రెస్ ఎంపీగా ఉన్న రాజగోపాల్ నాయుడికి అన్ని అసెంబ్లీ సెగ్మంట్లలో ఆధిపత్యం ఉన్నా..చంద్రగిరి నియోజకవర్గంలో మాత్రం పట్టులేదు. ఓ బలమైన నేతకు చంద్రబాబు ప్రత్యర్థి. ఆయన తరపున ప్రచారం చేసే బలమైన నేత కూడా లేరు. అయినప్పటికీ పట్టుదలగా బరిలో దిగారు చంద్రబాబు. జనతా పార్టీ, పట్టాభిరామ చౌదరి గురించి పట్టించుకోకుండా ఇంటింటికీ తిరిగి ప్రచారం ప్రారంభించారు.
ప్రతి ఒక్కరిని ప్రత్యక్షంగా కలిసి ఓటు వేయమని విజ్ఞప్తిచేశారు. అప్పటిదాకా నాయకులు ఇళ్లకు వచ్చి ప్రచారం చేయడం లేదు. ఊర్లోకి వచ్చే నేతలు గ్రామంలోని పెద్దమనుషులను పిలిచి, ఓటు వేయాలని ఆదేశించేవారు. కానీ ఓ అభ్యర్థిగా చంద్రబాబే స్వయంగా వచ్చి ఓటేయమని అడగడంతో నియోజకవర్గంలోని ప్రజలు చంద్రబాబు వైపు మొగ్గుచూపారు. ఫిబ్రవరి 27 న వెలువడిన ఫలితాల్లో 2494 ఓట్ల మెజారిటీతో చంద్రబాబు గెలిచినట్టు వెల్లడయింది. ఈ గెలుపు తర్వాత చంద్రబాబు వెనుతిరిగిచూసుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పై తనదైన ముద్రవేశారు. ఇదే సమయంలో దేశరాజకీయాల్లోనూ చక్రం తిప్పారు.