కొడుకు కోసం తండ్రి కష్టాలు

కొడుకు కోసం తండ్రి కష్టాలు

“వ‌య‌సు రీత్యా.. ప‌క్క‌న పెడితే.. ప‌నులు, వ్యూహాలు, దూకుడు రీత్యా చూసిన‌ప్పుడు చంద్రబాబు నేటి యువ‌త‌కు ఏమాత్రం తీసిపోరు”-ఇదీ టీడీపీ నాయ‌కులు గ‌తేడాది ముందు వ‌ర‌కు చెప్పిన మాట‌. “మా ముఖ్య‌మంత్రిని చూస్తే.. నాకే అసూయ క‌లుగుతుంది. ఆయ‌న దూకుడు చూస్తే.. నాకే సిగ్గ‌నిపిస్తుంది!!”-ఇదీ టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ అప్ప‌ట్లో త‌న తండ్రిని కొనియాడు తూ.. ప‌దే ప‌దే చేసుకున్న స్తోత్ర పాఠాలు. మ‌రి.. ఏడాదిలోనే చంద్ర‌బాబులో యువ కోణం న‌శించిందా? ఆయ‌న యువ‌త‌కు చేరువ కాలేక పోతున్నారా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

దీనికి కార‌ణం.. టీడీపీలోని చాలా మంది నాయ‌కులు, మాజీ మంత్రులు కూడా త‌మ పిల్ల‌ల భ‌విష్య‌త్తు విష‌యంలో చంద్ర‌బాబును న‌మ్మ‌లేక పోతున్నార‌నే అంశం.. తెర‌మీదికి వ‌స్తోంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు.. చంద్ర‌బాబుపై ఉన్న న‌మ్మ‌కం పార్టీలో స‌డ‌లుతోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అదే స‌మ‌యంలో వైసీపీ అధినేత‌, ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్‌పై యువ‌త‌కు న‌మ్మ‌కం పెరుగుతోంద‌ని తెలుస్తోంది.

దీనికి కార‌ణం.. ఇటీవ‌ల కొన్నాళ్లుగా త‌న‌యుల కోసం తండ్రులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. టీడీపీని వీడుతున్నారు. వాస్త‌వానికి టీడీపీ యువ‌తకు ప్రాధాన్యం ఇస్తుంద‌ని.. పార్టీలో 33 శాతం ప‌దవుల‌ను వారికే క‌ట్ట‌బెడుతుంద‌ని చెప్పిన చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేయ‌లేక పోయారు.

దీనికితోడు టీడీపీని చంద్ర‌బాబు త‌ర్వాత లీడ్ చేసే నాయ‌కుడు ఎవ‌రైనా ఉంటే.. అది ఆయ‌న కుమారుడు నారా లోకేషే! ఆయ‌న‌కు ఉన్న ఇమేజ్ ఏపాటిదో తెలిసిన నేప‌థ్యంలో ఆయ‌న వెంట న‌డిచినా ప్ర‌యోజనం ఉండ‌ద‌ని భావిస్తున్నారో .. ఏమో.. టీడీపీ నాయ‌కులు వ‌రుస పెట్టి త‌మ కుమారుల‌ను వైసీపీలోకి చేరుస్తున్నారు.

క‌ర‌ణం వెంక‌టేష్ కోసం చీరాల ఎమ్మెల్యే బ‌ల‌రాం, గాదె మ‌ధుసూద‌న్‌రెడ్డి కోసం మాజీ మంత్రి గాదె వెంక‌ట‌రెడ్డి, శిద్దా సుధీర్ కోసం.. మాజీ మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు.. తాజాగా విశాఖ ద‌క్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గ‌ణేష్‌.. త‌న ఇద్ద‌రు కుమారుల కోసం.. చంద్ర‌బాబును ప‌క్క‌న పెట్టారంటే.. ప‌రిస్థితి ఎలా ఉందో.. బాబుపై న‌మ్మ‌కం ఎంత ఉందో అర్ధ‌మ‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వెళ్లిపోయిన వారు వెళ్లిపోగా.. అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల్లోనూ త‌మ త‌న‌యుల‌ను బీజేపీ బాట‌పట్టించేందుకు జేసీ బ్ర‌ద‌ర్స్‌, ప‌రిటాల సునీత‌, వెంక‌టేశ్ వంటివారు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని స‌మాచారం.